శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమలలో నృత్యప్రదర్శన పోటీలు

శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమలలో నృత్యప్రదర్శన పోటీలు

తిరుమల, 2012 ఆగస్టు 8: శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినం సందర్భంగా తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 9, 10 తేదీల్లో శ్రీకృష్ణలీలాతరంగిణి పేరిట యువతీ యువకులకు నృత్య ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఈ పోటీలు జరుగనున్నాయి.

ఇందులో యువతీ యువకులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పురంధరదాస కీర్తనలతో కూడిన నృత్యరూపకాలను ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 50కి పైగా గ్రూపులు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్నం వరకు పోటీలు జరుగుతాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన గ్రూపులకు బహుమతులు ప్రదానం చేయడంతోపాటు అదేరోజు సాయంత్రం ప్రసిద్ధి చెందిన నాదనీరాజనం వేదికపై నృత్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తారు.

గోగర్భం ఉద్యానవనంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు

తితిదే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని గోగర్భం డ్యామ్‌ ఎదురుగా గల ఉద్యానవనాల్లో అత్యంత సౌందర్యవంతంగా వెలసి ఉన్న కాళీయమర్ధనుడైన శ్రీకృష్ణ భగవానుడి విగ్రహానికి శ్రీకృష్ణజన్మాష్టమిని పురస్కరించుకుని ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటల తరువాత నుండి ప్రత్యేక అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ దివ్య ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కొరకు అన్నప్రసాద వితరణ కూడా చేయనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.