శ్రీవారి అరుదైన ఛాయాచిత్రాల విరాళాలకు తితిదే ఆహ్వానం

తిరుమల, 2012 ఆగస్టు 21: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో అరుదైన ఛాయాచిత్రాలను విరాళంగా అందజేయాలని తితిదే దాతలను కోరుతోంది.

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసి ఉన్న తిరుమల దివ్యక్షేత్రంలో అనునిత్యం నిత్య కళ్యాణం పచ్చతోరణం వైభోగమే. ఏ రోజు చూసినా భక్తజనకోటి సందోహంతో తిరునాళ్ల ముచ్చటే. శ్రీవారికి నిర్వహించే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాల్లో నిర్వహించే  విశేషపూజలు, ఉత్సవాలు, సేవలు 400కు పైగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తజనకోటిలో సామాన్యులతో పాటు రాష్ట్రాధినేతలు, దేశాధినేతలు, వివిధ రంగాల్లో విఖ్యాతిగాంచిన ప్రముఖులు ఉండడం దైనందిన ప్రక్రియ.

సాధారణంగా స్వామివారి ప్రాభవాన్ని ఆయనకు నిర్వహించే ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన బ్రహ్మోత్సవాల సమయంలో ఛాయాచిత్రాల రూపంలో ఆవిష్కరించడం పరిపాటి. ఈ ఏడాది సెప్టెంబరు 18 నుండి 26వ తారీఖు వరకు జరుగనున్న వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరియు అక్టోబరు 15 నుండి 23వ తారీఖు వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారు, అమ్మవారి దేవాలయాలు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం 80 ఏళ్ల చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలిపే అరుదైన ఛాయాచిత్రాలు ఎవరివద్దయినా ఉంటే వాటిని తితిదేకి విరాళంగా అందజేయాలని తితిదే ప్రజాసంబంధాల విభాగం కోరుతోంది. తిరుపతిలో ఉన్న తితిదే పరిపాలనా భవనంలోని ప్రజాసంబంధాల అధికారి కార్యాలయం పనివేళల్లో అంటే ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల నడుమ దాతలు ఈ ఛాయాచిత్రాలను అందజేయాలని మనవి చేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.