శ్రీ‌వారి బ్ర‌హ్‌మోత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాలి – టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలును అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాలి – టిటిడి ఈవో  శ్రీ కె.వి.రమణాచారి

తిరుమల జూలై-2,2008: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించాలని తి.తి.దే., కార్యవిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక అన్నమయ్య భవన్‌లో వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ 1వ తేదిన ధ్వజారోహణం, అక్టోబర్‌ 5వ తేదిన గరుడోత్సవం, అక్టోబర్‌ 6వ తేదిన స్వర్ణరథం, అక్టోబర్‌ 8వ తేదిన రథోత్సవం, అక్టోబర్‌ 9వ తేదిన చక్రస్నానం నిర్వహిస్తామని, అదే విధంగా 9 రోజుల పాటు మాడవీధులలో ఊరేగే స్వామివారి వాహానాలకు సంబంధించిన చరిత్రలను, కథలను వాహనం బయలుదేరకముందే భక్తులకు వినిపించాలని, అదే విధంగా భక్తులను అలరించే విధంగా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శిని ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలలో అన్ని ఆర్జిత సేవలు రద్దుచేయాలని, వసతికి సంబంధించికూడా ఆడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని రద్దుచేయాలని ఆయన చెప్పారు. అలిపిరి, తిరుమల మధ్య భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసుశాఖను అదే విధంగా ఆగస్టు చివరినాటికి అన్ని ఇంజనీరింగ్‌ పనులు పూర్తి చేయాలని సి.ఇ ని కోరారు. బ్రహ్మోత్సవాలలో తిరుమలకు విచ్చేసే భక్తులందరి సౌలభ్యంకొఱకు ఎక్కువ సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేయాలని, ఆయన ఆర్‌.టి.సి అధికారులను కోరారు.

అదే విధంగా ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. నాలుగు మాడవీధులలో తిరుగు స్వామివారి వాహనాలను తిలకించే భక్తుల సౌకర్యార్థం అవసరమైన బ్యారికేడ్లు నిర్మించాలని, భక్తులకు అవసరమైన త్రాగునీటి సౌకర్యం, టాయ్‌లెట్‌ ఏర్పాట్లు ముందస్తుగా చేయాలని ఆయన ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. భక్తులకు సేవలందించడానికి గాను అవసరమైన స్కౌట్స్‌ మరియు గైడులు, శ్రీవారిసేవకుల సేవలను ఉపయోగించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా రెండు కాలినడక దారులలో భక్తులకు సౌకర్యాలు మెరుగు పరచడానికిగాను సంబంధిత అధికారులుతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు ప్రశాంతత, పచ్చదనం, పరిశుభ్రత, పవిత్రతను కల్పించాడానికి అన్ని శాఖల అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో తి.తి.దే., ప్రత్యేక అధికారి శ్రీఏ.వి.ధర్మారెడ్డి, ముఖ్యభద్రతాఅధికారి శ్రీరమణకుమార్‌, ఆర్‌.టి.సి. జనరల్‌ మేనేజర్‌ శ్రీ సూర్యప్రకాష్‌రావు, తిరుమల డి.ఎస్‌.పి. శ్రీసూర్యనారాయణ, తి.తి.దే.,చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీవి.ఎస్‌.బి.కోటేశ్వరరావు, ఇతర విభాగాదిపతులు అదికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.