స్వామి సంకల్పమే దాససాహిత్యం – తితిదే ఇఓ

స్వామి సంకల్పమే దాససాహిత్యం – తితిదే ఇఓ
 
తిరుమల, 10 ఫిబ్రవరి – 2013: విశ్వమానవ కల్యాణం కొరకు కలియుగంలో అపురూపమైన భక్తి సాధనం నామ సంకీర్తనమని, సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి సంకల్పంతోనే  దాససాహిత్యం ఉద్భవించిందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్‌.వి. సుబ్రమణ్యం అన్నారు.
 
ఆదివారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పురందరదాసు ఆరాధనా మహోత్సవాలలో భాగంగా శ్రీవారు-దేవేర్లు ఉత్సవరులకు ఊంజల్‌సేవ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇఓ మాట్లాడుతూ మానవునికి బాహ్య సౌందర్య – సౌకర్యాలు ఎన్నివున్న అమిత ఆనందాన్ని, ఆత్మశుద్ధిని కలిగించేది గోవిందనామం ఒక్కటే అన్నారు. భజన సాంప్రదాయంలో నేడు జరిగిన ఈ ఆరాధనా మహోత్సవాలు ఇక్కడ విచ్చేసిన భక్తులందరికి అత్యుత్కృష్టమైన మానసిక ఆనందాన్ని కలిగించిందన్నారు. సాక్షాత్తు స్వామివారే పురందరదాసులవారిచే 4 లక్షల పై చిలుకు కీర్తనలను రచింపచేసి మానవాళికి భక్తిరస సాంప్రదాయాన్ని బోధించారన్నారు. పురందరదాసు, అన్నమాచార్య, ఆంధ్రబోజుడు శ్రీకృష్ణదేవరాయులు మున్నగు వారు కారణ జన్ములని, వారిచే భగవంతుడే కలియుగంలో అక్షర మాలలతో భక్తి యజ్ఞాన్ని నిర్వహింపచేశారన్నారు. వారందించిన చైతన్య స్ఫూర్తితో మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
 
అంతకు పూర్వం ఉడిపి పలిమారు మఠాధిపతి శ్రీ విద్యాదీశతీర్థస్వామి తమ అనుగ్రహ భాషణంలో శ్రీవారు ఎవరి మాట వినడని తానే సర్వేశ్వరుడని తెలిపారు. అయితే ఆ భగవంతుడు ”అహంభక్త పరాధీనహ” అని తాను ఒక భక్తుని భక్తికి మాత్రమే వశుడవుతానని తెలిపారన్నారు. శ్రీవారు ఆనందనిలయాన్ని వదిలి నారాయణగిరికి తన భక్తుల కోరిక మేర వేంచేపు చేసేది ఏడాదిలో 2 పర్యాయాలు మాత్రమే అన్నారు. అది అన్నమాచార్య ఆరాధనోత్సవాలకు, పురందరదాసు ఆరాధనోత్సవాలకు మాత్రమే అన్నారు. నిజమైన భక్తునికి భగవదనుగ్రహం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.
 
ఈ కార్యక్రమంలో ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి ఆశోక్‌కుమార్‌, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ, ఇతర అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.