ALLURI SEETARAMARAJU IS A PRIDE OF ANDHRAS _ ఆంధ్రుల అభిమన్యుడు అల్లూరి సీతారామరాజు – పరిశోధకులు శ్రీ రమేష్ బాబు

TIRUPATI, 04 JULY 2024: Alluri Seetaramaraju made an indelible mark in the History of India in the freedom struggle and stood as a nightmare for Britishers with his fearless revolutionary ideologies, said renowned scholars. 

On the occasion of the 127th Birth Anniversary of the great freedom fighter, TTD has paid tributes at Annamacharya Kalamandiram in Tirupati on Thursday.

SVU research scholar Sri Ramesh Babu in his keynote address said, Alluri was best remembered for leading the Rampa Rebellion against the British in which he organised the tribal people of Vishakhapatnam and East Godavari districts to revolt against the British government. He sacrificed his life for the sake of his motherland at an young age. He is always remembered and revered for his act of bravery and is the pride of Andhras, he added.

Deputy EO Welfare Sri Anandaraju, DyEO Sri Devendrababu, SPWDPG Telugu HoD Dr Krishnaveni and others employees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆంధ్రుల అభిమన్యుడు అల్లూరి సీతారామరాజు – పరిశోధకులు శ్రీ రమేష్ బాబు

తిరుపతి, 04 జూలై 2024: మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు ఆంధ్రుల అభిమన్యుడని, ఆయన ఆంధ్రుడు అయినందుకు మనమందరం ఎంతో గర్వపడాలని ఎస్వీ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పరిశోధకులు శ్రీ రమేష్ బాబు ఉద్ఘాటచారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం శ్రీ అల్లూరి సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమం టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన శ్రీ రమేష్ బాబు మాట్లాడుతూ, ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు బ్రిటిష్ వారి దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యారన్నారు.గిరిజనుల శ్రమ, ఆస్తి దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా ఉండేదని తెలిపారు. ఈ కారణంగా మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేదని చెప్పారు.

మన్యం వాసుల కష్టాలను కడతేర్చడానికి, బ్రిటిష్ వారి దోపిడీని ఎదుర్కోవడానికి సీతారామరాజు గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేశారన్నారు. ఈ ప్రాంతంలోని గిరిజనులను సమీకరించి వారి దురలవాట్లను దూరం చేసి, యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినట్లు వివరించారు.

అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని యువత పుణికి పుచ్చుకొని ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

అంతకుముందు టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ అనందరాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటిసారిగా శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి ఉద్యోగి పని చేయాలన్నారు.

డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు తన స్వాతంత్ర పోరాటాలతో మన్యానికి వన్నె తెచ్చారన్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడే అలాంటి మహనీయుని స్మరించుకోవడం స్ఫూర్తి దాయకమన్నారు.

ఎస్ఇ శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, సమాజంలోని పెద్దలను గౌరవించడం, ఆ సమాజానికే గౌరవాన్ని తెస్తుందన్నారు. అల్లూరి సీతారామరాజు సామాజిక, పరిపాలన వ్యవస్థలపై పోరాడినట్లు, పేదరికం, నిరక్షరాస్యత, దురాలవాట్లను పోగొట్టడానికి ఆయన యుద్ధం చేశారన్నారు. ఆయన మార్గంలో మనమందరం నడిస్తే, సమాజానికి మంచి జరుగుతుందని వివరించారు.

అనంతరం పలువురు టీటీడీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై ఉపన్యాసించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ డబ్ల్యు డిగ్రీ మరియు పీజీ కళాశాల తెలుగు అధ్యాపకులు శ్రీమతి కృష్ణవేణి, ఇతర అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.