అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణ ప్రాంతంలో వైభవంగా శ్రీనివాసుడి వసంతోత్సవం

అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణ ప్రాంతంలో వైభవంగా శ్రీనివాసుడి వసంతోత్సవం

ఫిబ్రవరి 01, అమరావతి 2019: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణానికి భూక‌ర్ష‌ణంలో భాగంగా శుక్ర‌వారం వ‌సంతోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. జనవరి 28 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు టిటిడి ఆధ్యాత్మిక, ధార్మిక కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్న విషయం విధితమే.

ఇందులో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. వసంతఋతువులో మలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించుటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) శుక్ర‌వారం శోభాయమానంగా జరిగింది. ఇందులో ముందుగా
విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు. గంధంతో స్వామి,అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌పనం నిర్వహించారు. అంత‌కుముందు ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు చతుర్వేద పారాయణం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, ఇత‌ర అధికారులు, అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

కాగా, ఫిబ్రవరి 2వ తేదీ గురువారం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు చతుర్వేద పారాయణం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 3 నుండి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు చతుర్వేద పారాయణం, మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు భక్తి సంగీతం, సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. మొదటిరోజు ఋగ్వేదం, రెండో రోజు యజుర్వేదం, మూడో రోజు సామవేదం, నాలుగో రోజు అధర్వణ వేదం పారాయణం చేస్తారు.

రాష్ట్ర అభివృద్ధి, లోకకల్యాణం కోసం ఫిబ్రవరి 7 నుండి 10వ తేదీ వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 7న సాయంత్రం ఆచార్యవరణం, అంకురార్పణ, ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమాలు, ఫిబ్రవరి 10న ఉదయం చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమాలు, గోగణ నివేదనం, ఉదయం 9 నుండి 10 గంటల వరకు మీన లగ్నంలో ప్రథమ శిలేష్ఠకాన్యాసం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.