FREE EYE SCREENING CONDUCTED TO 4800 STUDENTS OF TTD
ఒకేరోజులో 4,800 మందికి రికార్డుస్థాయిలో నేత్ర వైద్య పరీక్షలు
తిరుపతి, 2012 ఆగస్టు 17: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో చదువుకుంటున్న 4800 మంది విద్యార్థినీ విద్యార్థులకు రికార్డు స్థాయిలో ఒకే రోజులో నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. తితిదే కేంద్రీయ వైద్యశాల, శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఈ శిబిరాన్ని శుక్రవారం తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈఓ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ జ్ఞానేంద్రియాల్లో కళ్లు ప్రధానమైనవని, తగిన జాగ్రత్తలు పాటించి వాటిని సంరక్షించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్థించి మంచి విలువలతో సమాజంలో ఒక గొప్ప స్థానం సంపాదించుకుని పాఠశాలకు మంచిపేరు తేవాలన్నారు. చెన్నైకి చెందిన శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టు సహకారంతో ఈ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కంటి దోషాలు ఉన్న విద్యార్థులకు అవసరమైన మందులు, కళ్లద్దాలను తితిదే ఉచితంగా అందజేస్తుందన్నారు.
తితిదే ముఖ్య వైద్యాధికారి డాక్టర్ సి.ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టుకు చెందిన 35 మంది ఆప్తోమెట్రిస్టులు ఐదు బృందాలుగా ఏర్పడి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. తిరుమల, తిరుపతిలో ఉన్న తితిదే పాఠశాలల్లో చదువుతున్న 4,800 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఒకే రోజులో కంటి వైద్యపరీక్షలు నిర్వహించడం విశేషమని వెల్లడించారు. వైద్యుల సూచనలను విద్యార్థులు తప్పక పాటించాలని, అప్పుడే మెరుగైన ఆరోగ్యవ్యవస్థను తయారు చేయడానికి వీలవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే విద్యాశాఖ విభాగం డెప్యూటీ ఈఓ శ్రీమతి పార్వతి, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుమారస్వామి, శ్రీ శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టు ట్రస్టీ రంగనాథ్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ విష్ణువాహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జ్యోతి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్కాలర్‌షిప్‌లపై ఆందోళన వద్దు – విద్యార్థులకు ఈఓ భరోసా
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అందాల్సిన మెస్ ట్యూషన్ ఫీజు(స్కాలర్‌షిప్)లు ఇంతకుముందు లాగే అందిస్తామని, ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తితిదేలో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లను వెనక్కు పంపినట్లు అపోహలతో కూడిన ఆందోళనలు చేయటం సరికాదని అన్నారు. తితిదే విద్యాసంస్థల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఈబిసి, మైనారిటీ విద్యార్థులకు అందుతున్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వ నిబంధనలకు లోబడి విద్యార్థులకు నష్టం జరుగకుండా అందజేస్తామని ఈఓ స్పష్టం చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.