Inauguration of Training programme for Telugu Teachers  _ విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

TTD Executive Officer Sri L.V. Subramanyam inaugurated Training Programme for Telugu Teachers at Annamacharya Kala Mandir in Tirupati on Saturday morning.
 
Sri Chaganti Koteswara Rao, Sri K.S.Sreenivasa Raju, Joint Executive Officer, Sri Kasireddy Venkat Reddy, Secretary HDPP, Sri Raghunath, Spl Officer, Dr. Medasani Mohan, Director Annamacharya Project, Sri Ravva Srihari, Editor in Chief, Sri Sambi Reddy, Pavani Seva Samithi and teachers were present on the occassion.
 

విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

తిరుపతి, 2012 ఆగస్టు 18: విలువలు పతనమవుతున్న నేటి సమాజంలో ఉపాధ్యాయులు నడుంబిగించి విద్యార్థులకు నీతి నియమాలు, నైతిక విలువలు బోధించాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సూచించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, పావని సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ”పద్యం ద్వారా పరమార్థం” పేరిట తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ ఉపాధ్యాయులు పరిపూర్ణ విశ్వాసంతో విద్యార్థులకు బోధించి సమాజశ్రేయస్సుకు కృషి చేయాలన్నారు. తనకు తెలుగు బోధించిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. గురువు లేకపోతే ఎంతటి గుణవంతుడికైనా సన్మార్గం తెలియదన్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠం ఎలా బోధించాలి అనే విషయాన్ని రామయణంలో వాల్మీకి మహర్షి వివరించారని తెలిపారు. పద్యం ద్వారా పరమార్థం సిద్ధిస్తుందని, చందోబద్ధమైన పద్యం ధారణకు అనువుగా ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలని ఆయన కోరారు.

తితిదే ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆచార్య రవ్వా శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజ జీవితానికి అవసరమైన విద్య తప్ప మిగిలిన విద్యలను విద్యార్థులు అభ్యసిస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. ప్రస్తుతం నీతిబోధ తగ్గిపోయిందని, ఉపాధ్యాయులు రామాయణ, మహాభారతం గ్రంథాల్లోని నీతిని విద్యార్థులకు తెలియజేయాలన్నారు.

పావని సేవా సమితి వ్యవస్థాపకుడు శ్రీ సాంబిరెడ్డి మాట్లాడుతూ నీతి, భక్తి  శతకాలను రామాయణ, భాగవతాల్లోని ప్రవచనాలను విద్యార్థులకు బోధించి జాతి పునర్నిర్మాణం చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి 300 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు.

ముందుగా ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ ఉప్పులూరి కామేశ్వరరావు రచించిన ”వాల్మీకి రామాయణం”, ఆచార్య రవ్వా శ్రీహరి రచించిన పోతనభాగవతం నుండి గ్రహించిన భర్తృహరి నీతి శతకం సరళవచనాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.