టిటిడి స్థానిక ఆలయాలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
టిటిడి స్థానిక ఆలయాలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 2019 ఫిబ్రవరి 11: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాలలో రథసప్తమి పర్వదినాన భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని మీటింగ్‌హాల్‌లో సోమవారం సాయంత్రం రథసప్తమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీ మంగళవారం టిటిడి స్థానిక ఆలయలైన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీకోదండరామస్వామివారి అలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామివారి ఆలయాలలో రథసప్తమి పర్వదినాన్ని అంగరంగవైభవంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఆలయాలను సర్వాంగసుందరంగా అలంకరించాలన్నారు. ఆలయం పరిసరాలలో చలువ పందిళ్లు, పుష్పాలంకరణలు, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
భక్తులకు సురక్షిత త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందివ్వాలన్నారు. ఆలయ పరిసరాలలో బ్యారీకేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా తగినంత మంది భద్రాత సిబ్బందిని నియమించాలన్నారు.అదేవిధంగా పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలన్నారు. వాహన సేవలలో, ఆలయ పరిసరాలలో హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ శ్రీధర్, శ్రీ సుబ్రమణ్యం, ఎస్‌ఇలు శ్రీ రాములు, శ్రీ వెంకటేశ్వర్లు, డిఫ్‌వో శ్రీ ఫణికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.