release a booklet on “Subhapradham” _ ”శుభప్రదం” కరదీపికను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

TIRUMALA, March 30:  Hon’ble CM and Union Minister released a booklet on “Subhapradham” training classess which is aimed at disseminating human values and ethics along with the morals of Hindu Sanatana Dharma to the youth aged between 15 to 17 years.
 
CV&SO Sri GVG Ashok Kumar, Addl CV&SO Sri Sivakumar Reddy, DyEOs Sri Chinnamgari Ramana, Sri Venkataiah, OSD Sri Damodar and others were present.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

”శుభప్రదం” కరదీపికను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

తిరుమల, మార్చి 30, 2013: యువతలో ధార్మిక చింతన, మానవీయ విలువలను పెంపొందించాలన్న సత్సంకల్పంతో గత ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ”శుభప్రదం” వేసవి శిక్షణ శిబిరాల కరదీపికను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి శ్రీ జైరాం రమేష్‌తో కలసి శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆవిష్కరించారు. అంతకుముందు వారిరువురు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తితిదే చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని గౌరవ అతిథులకు కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ఆధ్యాత్మిక విలువలు గల యువతను భారతదేశానికి అందించడమే లక్ష్యంగా తితిదే కొన్ని ఆధ్యాత్మిక అంశాలను, పురాణేతిహాసాల్లోని కథలను, దేశనాయకుల చరితలను, నైతిక కథలతో కూడిన అంశాలను ఈ కార్యక్రమంలో పొందుపరిచినట్టు వివరించారు. తితిదే చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని ఈవో తెలపడంతో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా, పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు గతేడాది మే 15 నుండి 26వ తేదీ వరకు శుభప్రదం పేరిట వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది మే 12 నుండి 18వ తేదీ వరకు రెండో విడత వేసవి శిక్షణ తరగతులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ తరగతులకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31వ తేదీతో గడువు ముగియనుంది. ఈ తరగతుల్లో బోధించే ఉపాధ్యాయుల కోసం హిందూ ధర్మప్రచార పరిషత్‌ పూర్వ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి కూర్చిన ”సనాతన ధర్మం-మానవీయ విలువలు శిక్షణ కార్యక్రమం కరదీపిక” అన్న శీర్షికతో శుభప్రదం పుస్తకాన్ని తితిదే ముద్రించింది. ఇందులో విద్యార్థులు సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు నిర్వహించాల్సిన నవవిధులను చక్కగా పేర్కొనడమైనది. అదేవిధంగా హిందూ ధర్మ పరిచయం – ప్రాశస్త్యం, వర్ణాశ్రమ ధర్మాలు, హిందూ ధర్మరక్షణ – మన కర్తవ్యం, పండుగల పారమార్థికత, పురాణాల్లోని మహనీయులు – మహిమలు, భాగవత, భారత, రామాయణ కథల్లోని ముఖ్యాంశాలు, దేశభక్తి వంటి అనేకానేక శీర్షికలతో, మధ్య మధ్యలో చక్కటి సందేశాలతో కూడిన పద్యాలతో 64 పేజీల ఈ కరదీపిక విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో కూర్చబడింది.

కాగా తొలివిడత శుభప్రదం కార్యక్రమంలో మూడు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. రెండో విడత వేసవి శిక్షణ తరగతుల కోసం ఇప్పటికే పది వేలకు పైగా దరఖాస్తులు అందాయని హిందూ ధర్మప్రచార పరిషత్‌ వర్గాలు తెలిపాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.