Shubhapradam” to lead the ‘right way of life’ – TTD EO _ జీవిత పాఠాలు నేర్పేందుకే ”శుభప్రదం” – తితిదే ఈవో
path.
జీవిత పాఠాలు నేర్పేందుకే ”శుభప్రదం” – తితిదే ఈవో
తిరుపతి, మే 12, 2013: విద్యార్థులు ఉన్నతమైన జీవితాన్ని సాగించేందుకు అవసరమైన అన్ని విషయాలు నేర్పేందుకే శుభప్రదం వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. రెండో విడత శుభప్రదం వేసవి శిక్షణ తరగతుల ప్రారంభోత్సవం ఆదివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ పల్లంరాజు హాజరుకాలేక పోవడంతో శుభప్రదం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సందేశాన్ని పంపారు.
ఈ సందర్భంగా తితిదే ఈవో ప్రసంగిస్తూ మాతృ దినోత్సవం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ముదావహమన్నారు. ప్రస్తుత సమాజంలో ఆధ్యాత్మిక, మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయని, వాటిని తిరిగి పెంపొందించేందుకు ఈ తరగతులు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సనాతన సంప్రదాయ విలువలు పాటించే మంచి కుటుంబాన్ని తయారు చేయగలిగితే మంచి సమాజం తయారవుతుందన్నారు. విద్యార్థి థలోనే ఇలాంటి విలువలను ఒంటబట్టించుకోవడం ద్వారా సమసమాజాన్ని స్థాపించే భావిభారత పౌరులుగా ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ తరగతుల్లో నిష్ణాతులు బోధించే విషయాల్లో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ ప్రసంగిస్తూ విద్యార్థులకు మానవీయ విలువలను బోధించేందుకు తితిదే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా అవసరమన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
హిందూ ధర్మప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి ఆచార్య హెచ్.ఎస్.బ్రహ్మానంద కీలకోపన్యాసం చేస్తూ ప్రస్తుత తరుణంలో జాతీయ ఆవశ్యకతగా శుభప్రదం కార్యక్రమాన్ని తితిదే నిర్వహిస్తోందన్నారు. నేటి జీవనవిధానం ఉరుకులు పరుగులతో సాగుతోందని, ప్రతి ఒక్కరూ కంప్యూటర్ గురించి తెలుసుకోవాలే గానీ, కంప్యూటర్‌గా మారిపోకూడదని అన్నారు. మన పవిత్ర గ్రంథాల్లో అన్ని అంశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వ్యక్తి గురించి రామాయణం తెలియజేస్తుందని, సమాజం గురించి మహాభారతం తెలుపుతుందని, ఆత్మ గురించి భాగవతం వివరిస్తుందని అన్నారు.
తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రసంగిస్తూ భారతీయ సనాతన ధర్మం విశిష్టమైనదని, కేవలం వాక్కు ద్వారా కొన్ని వేల సంవత్సరాలుగా మనగలుగుతోందని అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మూడు థాబ్దాలుగా హైందవ ధర్మానికి విఘాతం కలుగుతోందని, శుభప్రదం లాంటి కార్యక్రమాల ద్వారా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య ఉదయగిరి రాజేంద్ర, తితిదే పాలకమండలి సభ్యులు శ్రీ శ్రీనాథరెడ్డి, ఎంఎల్‌సి శ్రీ బత్యాల చెంగల్రాయలు, తితిదే విద్యాశాఖాధికారి శ్రీ శేషారెడ్డి, ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాథ్, ఎపిక్ స్టడీస్ కో-ఆర్డినేటర్ శ్రీ దామోదర్‌నాయుడు తదితరులు ప్రసంగించారు. తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ విద్యార్థి ఎం.మహేష్ గత శుభప్రదం తరగతుల్లో నేర్చుకున్న కొన్ని విషయాలను సభికులకు తెలియజేశాడు.
‘యువత – భవిత’ పుస్తకావిష్కరణ :
ఈ సందర్భంగా ప్రముఖ పండితులు శ్రీ చివుకుల రమాకాంతశర్మ రచించిన ‘యువత – భవిత’ పుస్తకాన్ని తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. శుభప్రదం, సదాచారం తరగతులకు మార్గదర్శనం చేసేలా రచయిత ఈ పుస్తకాన్ని రచించారు. అదేవిధంగా వాగ్గేయకార వైభవం కార్యక్రమంలో భాగంగా మే 16వ తేదీన తిరుమలలో నిర్వహించనున్న శ్రీ త్యాగరాజస్వామి 246వ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను తితిదే ఈవో ఆవిష్కరించి అతిథులకు అందజేశారు.
కాగా హైదరాబాదులోని నారాయణగుడలో ఉన్న కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన శుభప్రదం తరగతుల ప్రారంభోత్సవంలో తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన శుభప్రదం కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు స్థానిక అధికారులతో కలిసి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.