భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించిన శ్రీవారి సేవకులు

భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించిన శ్రీవారి సేవకులు

జనవరి 24, తిరుమల 2018: రథసప్తమిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వాహన సేవలు వీక్షించేందుకు విచ్చేసిన వేలాది మంది భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ శ్రీవారి సేవకులు విశేష సేవలందించారు.

టి.టి.డి ఈ.ఓ శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో దాదాపు 3000 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్‌ విభాగాలకు సంబంధించిన వివిధ ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు. బుధవారం ఉదయం 4 గంటల నుండి నాలుగు మాడ వీధులలోని గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు ఉదయం కాఫీ, పాలు, త్రాగునీరు అల్పాహారం, మజ్జిగ, అన్నప్రసాదాలు భక్తి శ్రద్ధలతో పంపిణీ చేశారు. భక్తులు గ్యాలరీలలోనికి వచ్చేందుకు మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, గ్యాలరీలలోని ముఖ్యమైన ప్రాంతాలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టి.టి.డి అధికారులు, సిబ్బందికి సహకరించారు.

టి.టి.డి హిందూధర్మ ప్రచార పరిషత్‌ ముద్రించిన రథసప్తతమి, గోవిందనామాలు, సుప్రభాతం, లలితాసహస్రనామం, విష్ణు సహస్రనామం పుస్తక ప్రసాదాలను కూడా శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అందిస్తున్నారు. తిరుమలలో వివిధ ప్రాంతాలలో భక్తులకు తిలకధారణ చేస్తున్నారు.

అదే విధంగా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కూడా టి.టి.డి, విజిలెన్స్‌ మరియు పోలీస్‌ సిబ్బంది సహకారంతో తిరుమలలోని అన్ని ప్రాంతాలలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో విధులు నిర్వహించారు.

టి.టి.డి సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో నాలుగు మాడ వీధులు

తిరుమలలో తొలిసారిగా తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నాలుగుమాడ వీధులలో ఒక్కో వీధికి ఒక్కొక్క సీనియర్‌ అధికారిని నియమించారు. వీరు క్రిందిస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకొని టి.టి.డి భక్తులకు అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా సకాలంలో అందించే విధంగా ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా ఉత్తర మాడ వీధిలో ఎఫ్‌ఎ ఆండ్‌ సిఏవో శ్రీ ఓ. బాలాజీ, తూర్పుమాడ వీధిలో ఎస్‌.ఇ1 శ్రీ రమేశ్‌ రెడ్డి, దక్షిణమాడ వీధిలో దేవస్థానం విద్యాశాఖాధికారి శ్రీ రామచంద్ర, పడమర మాడ వీధినందు ఎస్‌.ఇ3 శ్రీ సుధాకర్‌ రావులు పర్వవేక్షించారు. వీరి పర్వవేక్షణలో ఇతర అధికారులు, ఉద్యోగులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. గ్యాలరీలలోని భక్తులకు ఉదయం అల్పాహారంగా ఉప్మా, పొంగలి, కాఫీ, పాలు. మధ్యాహ్నం సాంబారన్నం, బిస్‌మిల్లాబాత్‌, టమోటారైస్‌, సాయంత్రం గుగ్గుళ్ళు, టమోటాకిచ్చడి మరియు 8లక్షల త్రాగునీరు ప్యాకెట్లు, 3లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.