గరుడసేవనాడు భక్తిభావంతో అన్నప్రసాదాలు అందించాలి – అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్
గరుడసేవనాడు భక్తిభావంతో అన్నప్రసాదాలు అందించాలి – అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్
అక్టోబరు 13, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరుగనున్న గరుడసేవనాడు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు భక్తిభావంతో అన్నప్రసాదాలు అందించాలని టిటిడి అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ కోరారు.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శనివారం శ్రీవారి సేవకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల్ మాట్లాడుతూ విశేషమైన గరుడసేవనాడు విశేషంగా భక్తులు విచ్చేస్తారని, శ్రీవారి సేవకులు, అన్నప్రసాదం సిబ్బంది సమన్వయం చేసుకుని క్రమశిక్షణతో అన్నప్రసాదాలు అందించాలని సూచించారు. భక్తులకు తాగునీటి బాటిళ్లు, మజ్జిగ, పులిహోర, టమోటా రైస్, సాంబారన్నం, ఉప్మా, సుండలు, టి, కాఫి, పాలు అందిస్తామన్నారు. భక్తులు కూర్చున్నచోటకు వెళ్లి అన్నప్రసాదాలు అందించాలని ఆయన కోరారు.
ఆరోగ్య విభాగం అధికారి డా.. శర్మిష్ట మాట్లాడుతూ అన్నప్రసాదాలు, తాగునీరు వృథా చేయకుండా భక్తులకు సూచనలు ఇవ్వాలని, చెత్తకుండీలను వినియోగించాలని కోరారు. గ్యాలరీలకు అనుబంధంగా మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయని, వీటిని సక్రమంగా వినియోగించేలా చూడాలని సూచించారు.
ప్రజాసంబంధాల అధికారి డా.. టి.రవి మాట్లాడుతూ శ్రీవారి సేవకులకు గ్యాలరీల వారీగా విధులు కేటాయించామని, నిర్దేశించిన సమయానికి తప్పకుండా గ్యాలరీలకు చేరుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో టిటిడి ఎస్ఇలు శ్రీ సుధాకరరావు, శ్రీ రమేష్‌రెడ్డి, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఏఈవో శ్రీ గోపాలరావు, ఏఈ శ్రీ వరప్రసాద్ ఇతర అధికారులు, అన్నప్రసాదం సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.