GOVARDHANAGIRIDHARA SHINES BRIGHT ON SURYA PRABHA_ సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ప్రకాశం
Appalayagunta, 19 Jun. 19: Holding the mammoth Govardhana Mount on His little finger of right hand and flute in another, Lord in the guise of Govardhanagiridhara Govinda, shined brightly on Suryaprabha Vahanam.
On the seventh day morning as a part of annual brahmotsavams in Appalayagunta, Sri Prasanna Venkateswara Swamy took a celestial ride on Suryaprabha Vahanam.
The bhajan and kolatam dance troupes added glamour to the procession. Devotees gathered in large numbers to witness the procession.
Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendent Sri Gopala Krishna Reddy, and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ప్రకాశం
తిరుపతి, 2019 జూన్ 19: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం స్వామివారు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో కటాక్షించాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే శ్రీ ప్రసన్న సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
జూన్ 20న రథోత్సవం
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 9.15 గంటలకు మిథున లగ్నంలో స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్ శ్రీసూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.