VIJAYADASA ARADHANA IN TIRUMALA _ తిరుమలలో శ్రీ విజ‌య‌దాస‌రు ఆరాధనా మహోత్సవాలు

న‌వంబ‌రు 13, 14వ తేదీల్లో తిరుమలలో శ్రీ విజ‌య‌దాస‌రు ఆరాధనా మహోత్సవాలు

తిరుమల, 2021 న‌వంబ‌రు 12: ప్ర‌ముఖ కర్ణాటక సంగీత దాస తత్వవేత్తలలో ఒకరైన శ్రీ విజ‌య‌దాస‌రు ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో న‌వంబ‌రు 13, 14వ తేదీల్లో తిరుమల ఆస్థాన మండ‌పంలో జరుగనున్నాయి. కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా న‌వంబ‌రు 13న ఉద‌యం 8 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు, న‌వంబ‌రు 14న ఉద‌యం 8 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ విజ‌య‌దాసుల సంకీర్త‌న‌లు పారాయ‌ణం చేస్తారు. ఈ సంద‌ర్భంగా దాస‌సాహిత్య స‌ర్వ‌స్వ 3, 4 సంపుటాలను ఆవిష్క‌రించ‌నున్నారు.

శ్రీ విజయదాసరు (1682 – 1755), కన్నడలో 25 వేల‌కు పైగా భక్తి గీతాలను స్వరపరిచారు. మధ్వాచార్యుల ద్వైత తత్వశాస్త్రంలో అత్యంత ప్రసిద్ధ పండితుడు, తత్వవేత్తలలో ఒకరు.

ఈ కార్యక్రమాల ఏర్పాట్ల‌ను టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.