అక్టోబరు 2 నుండి తితిదే పాఠశాలల్లో ‘సదాచారం’

అక్టోబరు 2 నుండి తితిదే పాఠశాలల్లో ‘సదాచారం’

తిరుపతి, 2012 అక్టోబరు 1: తితిదే విద్యాసంస్థల్లోని పాఠశాలల్లో చదువుకుంటున్న ఆరు నుండి పదో తరగతి వరకు గల విద్యార్థులకు భారతీయ హైందవ ధర్మంలోని నైతిక విషయాలను, మానవతా విలువలను, సాంస్కృతిక మూల్యాలను బోధించాలని కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం నిర్ణయించారు. ఈ మేరకు తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ”సదాచారం” పేరుతో అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి నుండి విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తితిదే ఆధ్వర్యంలోని ఏడు పాఠశాలల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ప్రారంభ కార్యక్రమానికి ఒక్కో పాఠశాలకు ఒక్కో ఉన్నతాధికారి ముఖ్య అతిథిగా హాజరవుతారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో జరుగనున్న కార్యక్రమానికి తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక్కడ తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి వక్తగా వ్యవహరిస్తారు. శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాలలో జరుగనున్న కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా, ప్రొఫెసర్‌ హెచ్‌.ఎస్‌.బ్రహ్మానంద వక్తగా పాల్గొంటారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలలో జరుగనున్న కార్యక్రమానికి శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి ముఖ్య అతిథిగా, డాక్టర్‌ పి.చెంచుసుబ్బయ్య వక్తగా హాజరు కానున్నారు.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలలో జరుగనున్న కార్యక్రమానికి తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ ముఖ్య అతిథిగా, ప్రొఫెసర్‌ సర్వోత్తమరావు వక్తగా హాజరవుతారు. శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో జరుగనున్న కార్యక్రమానికి డెప్యూటీ ఈవో(సేవలు) శ్రీమతి సూర్యకుమారి ముఖ్య అతిథిగా, శ్రీ సముద్రాల థరథ్‌ వక్తగా హాజరుకానున్నారు. తాటితోపులోని శ్రీ కపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాలలో జరుగనున్న కార్యక్రమానికి ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా, డాక్టర్‌ చెన్నకేశవులునాయుడు వక్తగా హాజరవుతారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య ఉన్నత పాఠశాలలో జరుగనున్న కార్యక్రమానికి చీఫ్‌ ఇంజినీరు శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా, డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి వక్తగా హాజరుకానున్నారు.

ఈ శిక్షణలో విద్యార్థులకు సత్యం, దయ, శాంతి, అహింస, పరోపకారం, త్రికరణశుద్ధి, సమభావన, సత్ప్రవర్తన, త్యాగం, సత్సాంగత్యం, యోగాసనాలు, వంటి 40 అంశాలను బోధించనున్నారు. డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య బ్రహ్మానంద, ఆచార్య సర్వోత్తమరావు, డాక్టర్‌ చెంచుసుబ్బయ్య వంటి నిష్ణాతులైన పండితులు విద్యార్థులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన ”శుభప్రదం” వేసవి శిక్షణ తరగతులకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుండి విశేష స్పందన లభించిన నేపథ్యంలో తితిదే ‘సదాచారం’ కార్యక్రమాన్ని రూపొందించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.