అర్చకులు శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్య

తిరుపతి, 2012 ఆగస్టు 25: అర్చకులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు కృషి చేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్వేత భవనంలో 5 రోజుల పాటు జరిగిన వైదిక స్మార్థ నాలుగో బ్యాచ్‌ అర్చక పునశ్చరణ తరగతుల ముగింపు సమావేశం శనివారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ అర్చకులు సంస్కారవంతులైనప్పుడే సమాజం సంస్కరించబడుతుందని అన్నారు. అర్చకులకు వాక్‌శుద్ధి ఉండాలన్నారు. అర్చకులు విశాలమైన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని, అందరి శ్రేయస్సు కోసం భగవంతుడిని ప్రార్థించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇటీవల నిర్వహించిన మనగుడి కార్యక్రమం విజయవంతమైందని, రెండో విడత కార్యక్రమం త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు.

శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ మాట్లాడుతూ అర్చక శిక్షణలో అర్చకుని విధులు, త్రికాల సంధ్యావందనం, గాయత్రి స్తోత్రం వల్ల వాక్‌శుద్ధి, యజ్ఞయాగాదులలో చేసిన దోషాలు-ప్రాయశ్చిత్తాలు, సూర్య నమస్కారం విశిష్టత, శిల్పకళ తదితర విషయాలను బోధించినట్టు వివరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అర్చకులు హిందూ ధర్మ పరిరక్షకులుగా నిలవాలని ఆకాంక్షించారు.

తితిదే వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ప్రసంగిస్తూ రాబోయే తరాల వారికి అర్చకత్వాన్ని అందించడమే ఈ పునశ్చరణ తరగతుల ఉద్దేశమని తెలిపారు. అన్ని శాస్త్రాల సమాహారమే ఆగమశాస్త్రమని, దీని ప్రకారమే పూజా విధానాలు సాగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అనంతరం అర్చక పునశ్చరణ తరగతుల అధ్యాపకులను ఈఓ సన్మానించారు. అనంతరం అర్చకులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన 87 మంది వైదిక స్మార్థ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.