VENGAMAMBA VARDHANTI _ ఆగస్టు 5, 6వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు

TIRUPATI, 30 JULY 2022: The 205th Vardhanti utsavams of the Saint Poetess Matrusri Tarigonda Vengamamba will be observed in Tirumala, Tirupati and Tarigonda on August 5 and 6 by TTD.

On August 5 there will be devotional programmes in Annamacharya Kalamandiram at Tirupati while on August 6, Pushpanjali at Vengamamba Brindavanam in Tirumala.

At Tarigonda, Sri Lakshmi Narasimha Swamy Kalyanam takes place on August 6 evening between 6pm and 8pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 5, 6వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు

తిరుపతి, 2022 జూలై 30: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 5, 6వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి.

వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 5వ తేదీన ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉద‌యం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆగస్టు 6వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టీటీడీ ఉన్నతాధి కారులు పుష్పాంజలి సమర్పించనున్నారు. అనంత‌రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్టిగానం జ‌రుగ‌నుంది.

తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు. ఈమెకు పదేళ్ల వయసులోనే ఇంజేటి వేంకటాచలపతి అనే వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. వివాహమైన కొన్నాళ్లకే భర్త వియోగం ఏర్పడింది. అయినా శ్రీ వేంకటేశ్వరుడే తన భర్త అని ప్రకటించి వెంగమాంబ ముత్తయిదువు చిహ్నాలు ధరించే ఉండేవారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక విద్య, యోగవిద్య ఉపదేశం పొందారు. కొద్దికాలానికే ఆ విద్యల్లో ఎంతో అనుభవం సాధించారు. ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి.

వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. ఈ సేవ నేటికీ జరుగుతూనే ఉంది. 1817వ సంవత్సరంలో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.