క‌ళ‌ల‌పై భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆస‌క్తి పెంచాలి : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ 

క‌ళ‌ల‌పై భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆస‌క్తి పెంచాలి : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ 

తిరుపతి, 2019 డిసెంబ‌రు 23: నాట‌క క‌ళ‌ల‌పై భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆస‌క్తి పెంచేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ ఉద్ఘాటించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో సోమ‌వారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ స‌భ్యుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ నాట‌క క‌ళ‌లు అంత‌రించి పోకుండా కాపాడుకోవ‌ల‌సిన భాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల నాడిని బ‌ట్టి, వారిని ఆక‌ర్షించే విధంగా నాట‌కాలు ఉండాల‌న్నారు. పౌరాణిక నాట‌కాల‌తో పాటు సామాజిక నాట‌కాల సంఖ్య పెంచాల‌ని, ఆ నాట‌కాల‌ ద్వారా స‌మాజానికి సందేశం ఇచ్చేవిధంగా రూపొందించాల‌న్నారు. తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ప్ర‌తి నెలా ఒక రోజు నాట‌క‌ క‌ళ‌ల‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. నాట‌కాల‌ ప్ర‌ద‌ర్శ‌న‌లో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగించి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వాల‌న్నారు. కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పిస్తూ, పిల్ల‌ల‌కు మ‌న పురాణాల గురించి తెలియ‌జేస్తూ, నాట‌క క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా రాబోవు త‌రాల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌వ‌చ్చ‌న్నారు. 

శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ ప్ర‌తి నెలా రోజువారీ కార్య‌క్ర‌మాల‌ను రూపొందించాల‌న్నారు.  టిటిడి ఆధ్వ‌ర్యంలోని క‌ళాశాల‌ల్లో ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు టిటిడి కృషి చేస్తోంద‌న్నారు. త‌ద్వారా విద్యార్థుల‌లో నాట‌కాల‌పై ఆస‌క్తి పెంచ‌వ‌చ్చ‌న్నారు.      

శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ 65వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు ఏప్రిల్ నెల‌లో నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జెఈవో నాట్య కళాపరిషత్ స‌భ్యుల‌ను కోరారు. 

ఈ సమావేశంలో డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్, టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా.టి.ర‌వి,  శ్రీ నాట్య కళా పరిషత్‌ కార్యదర్శి శ్రీ ఎల్‌.జయప్రకాష్‌,  సంయుక్త కార్య‌ద‌ర్శి శ్రీ కోనేటి సుబ్బారాజు, తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.