”టీటీడీ అకౌంట్స్‌ విభాగంలో ప్రమోషన్లకు బ్రేక్‌” వార్త వాస్తవ దూరం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
వివరణ,  తిరుపతి, ఏప్రిల్‌ 11, 2011

”టీటీడీ అకౌంట్స్‌ విభాగంలో ప్రమోషన్లకు బ్రేక్‌” వార్త వాస్తవ దూరం

ఏప్రిల్‌ 11వ తేదిన ”సాక్షి” దినపత్రిక నందు ప్రచురించిన ”టీటీడీ అకౌంట్స్‌ విభాగంలో ప్రమోషన్లకు బ్రేక్‌” అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

తితిదేలో ముఖ్యంగా ఇంజనీరింగ్‌, విద్యాశాఖ, ట్రాన్సుఫోర్టు, వైద్యశాఖ లాంటి పలు విభాగాలలో సంబంధింత విభాగాలకు అవసరమైన నైపుణ్యం కల్గిన సిబ్బంది తమ సేవలను అందిస్తున్నారు. వీరితో పాటు తితిదేలోని ఇతర ఉద్యోగుల సేవలను సైతం సదరు విభాగాలలో ఉపయోగించుకోవడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే తితిదేలోని అకౌంట్స్‌ విభాగంలో అకౌంటెంట్లతో పాటు సాధారణ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
 

అయితే గతంలో రాష్ట్ర పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీవారు తితిదేలో ఆడిట్‌ అభ్యంతరాలున్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ఒక ప్రత్యేక అకౌంటింగ్‌ క్యాడర్‌ను ఏర్పాటు చేయాలని తితిదే ఆదేశించడం జరిగింది. అంతేగాక ఈ ప్రక్రియ సమర్థవంతంగా, త్వరితగతిన పూర్తిచేసేందుకు సంబంధిత అకౌంటెంట్స్‌ కొరతను తితిదే గుర్తించింది. ఈ విషయమై 2006లోజరిగిన బోర్డు సమావేశంలో బోర్డు నిర్ణయం 399 ప్రకారం ప్రత్యేక అకౌంటింగ్‌ క్యాడర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2008 ఏర్పాటు చేసిన ఆంజనేయరెడ్డి కమిటీ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది.

పై కారణాల వలన తితిదేలో ప్రత్యేక అకౌంటింగ్‌ క్యాడర్‌ను ఏర్పాటుచేయాలనే సదుద్దేశ్యంతో స్పెసిఫైడ్‌ అథారిటీ తన నిర్ణయం 306-20-01-2011 తేది ప్రకారం నియామకాలు చేపట్టాలని భావించింది.

అయితే సదరు వార్తలో తితిదే ఉద్యోగులకు ప్రమోషన్లకు బ్రేక్‌ పడుతుందని, యుడిసి, సూపరింటెండెంట్లకు ప్రమోషన్లు వుండవని వ్రాయడం కేవలం ఒక అపోహ మాత్రమే. వీరు ఏ విభాగంలో పనిచేసినా వారికున్న సీనియారిటీ, రోస్టర్‌ పాయింట్‌ను బట్టి పదోన్నతులు కల్పించడం జరుగుతుందని అంతేగాకుండా అకౌంట్స్‌ నమోదుకు మార్గదర్శకాలు పక్కాగాను, పూర్తి పారదర్శకతతో వున్నవని, ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరంలేదని తెలియజేస్తున్నాం.

కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రికలో వివరణగా ప్రచురించాల్సిందిగా కోరుచున్నాము.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి