డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

తిరుమల, 08, న‌వంబ‌రు 2020: తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం జ‌రిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు :

– కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలను అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వ‌హించాం.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాలు :

– శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల త‌ర‌హాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో నవంబరు 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల‌ను ఏకాంతంగా నిర్వహిస్తాం.

కార్తీక మాస మహావ్రత దీక్ష :

–  సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ  నవంబరు 16 నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు కార్తీకమాస రుద్రాభిషేకం,  కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన స‌మారాధ‌న‌,  కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు నిర్వ‌హిస్తాం.

– శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా వీటిని ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.

సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లు :

– తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, విష్ణునివాసంలో సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నాం.

– భ‌క్తుల ర‌ద్దీని బ‌ట్టి వార‌పు రోజుల్లో 7 వేల టోకెన్లు, వారాంతంలో మ‌రిన్ని అద‌న‌పు టోకెన్లు ఇస్తున్నాం.

– సర్వదర్శనం టైంస్లాట్‌ కౌంటర్ల వద్ద భక్తులు విధిగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ వెంట తెచ్చుకోవడం లాంటి కోవిడ్‌-19 నిబంధనల‌ను పాటించాల‌ని విజ్ఞప్తి చేస్తున్నాం.

తిరుమల‌లో పర్వదినాలు :

– నవంబరు 14న దీపావళి ఆస్థానం.

– నవంబరు 18న నాగుల‌ చవితి.

– నవంబరు 21న తిరుమల‌ శ్రీవారి పుష్పయాగ మహోత్సవం.

టిటిడి డైరీలు, క్యాలెండర్లు :

– 2021వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీల‌ను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు అమేజాన్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌లోనూ బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించడమైనది.  

– తిరుమల‌, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాల‌లు, విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాలు, టిటిడి అనుబంధ ఆల‌యాల్లో వీటిని అందుబాటులో ఉంచాం.

పారాయ‌ణ కార్య‌క్ర‌మాల‌కు విశేష స్పంద‌న :

– ప్ర‌పంచ‌మాన‌వాళికి ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై నిర్వ‌హిస్తున్న సుంద‌ర‌కాండ పారాయ‌ణం, విరాట‌ప‌ర్వం పారాయ‌ణం, గీతాపారాయ‌ణం కార్య‌క్ర‌మాల‌కు భ‌క్తుల ప్ర‌శంస‌లు అందుతున్నాయి. వీటిని ఆద‌రిస్తున్న భ‌క్తుల‌కు కృత‌జ్ఞ‌త‌లు.

– ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేస్తున్న ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మాల‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది.

– ఈ కార్య‌క్ర‌మాల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నిర్వ‌హించేందుకు టిటిడి బోర్డులో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.