దక్షిణ భారత కర్ణాటక సంగీత కళాశాలల సమ్మేళనంపై తితిదే ఈఓ సమీక్ష

దక్షిణ భారత కర్ణాటక సంగీత కళాశాలల సమ్మేళనంపై తితిదే ఈఓ సమీక్ష

తిరుపతి, 2012 సెప్టెంబరు 7: నవంబరు 23 నుండి 27వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణ భారత సంగీత కళాశాలల సమ్మేళనం నిర్వహణపై తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం సాయంత్రం శ్రీ పద్మావతి అతిథిగృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సంగీత విద్య బోధనలో నైపుణ్యం, ఆసక్తిని పెంచేందుకు కళాశాలల అధ్యాపకులకు, విద్యార్థులకు 5 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ఆధ్యాత్మిక, సాహిత్య విలువలు అర్థమయ్యేలా చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. సదస్సు కోసం ముందుగా అక్టోబర్‌ మొదటి లేదా రెండో వారంలో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, త్రివేండ్రంలో కళాశాల విద్యార్థులకు సంగీతంలో ప్రాథమిక పోటీలు నిర్వహించి కొన్ని గ్రూపులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపికైనవారికి తిరుపతిలో జరుగనున్న కళాశాలల సమ్మేళనంలో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఐదు రోజుల సదస్సులో ఒక్కోరోజు ఒక్కో సంగీతజ్ఞుల గురించి తెలియజేయాలని, సంగీత అధ్యాపక వృత్తిలో ఉండి గుర్తింపునకు నోచుకోని వారిని సత్కరించాలని ఈఓ కోరారు.

ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి చల్లా ప్రభావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.