దేశవాళి ఆవులను మాత్రమే కానుకగా ఇవ్వాలి

దేశవాళి ఆవులను మాత్రమే కానుకగా ఇవ్వాలి

తిరుపతి, ఫిబ్రవరి – 25, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములలోని వివిధ ఆలయాల నిత్య కైంకర్యాలకు దేశవాళి ఆవుపాలను మాత్రమే వినియోగించవలెనని తితిదే నిర్ణయించింది. కనుక భక్తులు, ధాతలు దేశవాళి ఆవులను మాత్రమే కానుకగా (వితరణ) శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాల, తిరుపతి నందు సమర్పించవలసిందిగా కోరడమైనది.

ఇటీవలి కాలములో కొందరు భక్తులు దేశవాళి పశువుల పాలను దేవాలయములలో జరుగు నిత్యకైంకర్యములకు వాడినచో శ్రేష్టము అని అభ్యర్థించినారు. కాబట్టి వారి అభ్యర్థనను మన్నించి తిరుమల తిరుపతి దేవస్థానము వారు దేశవాళి పశుసంతతిని పెంపొందించుటకు సంకల్పించినారు. కావున భక్తులు ”దేశవాళి ఆవులను” మాత్రమే వేంకటేశ్వర స్వామి వారికి సమర్పించి తద్వారా భారతీయ పశుసంతతిని రక్షించుటకు అవకాశము కల్పించగలరు. తద్వారా ఉత్పత్తి అయిన పాలు, పెరుగు, వెన్న భగవంతుని నిత్య కైంకర్యములకు ఉపయోగించబడును.

ప్రస్తుతము తిరుపతి నందు ఉన్న ఎస్‌.వి.గోసంరక్షణ శాలయందు తగినంత స్థలము లేనందువలన మరియు త్రాగునీటి సమస్యల వలన అన్ని జాతుల పశువులను కానుకగా భక్తుల నుండి తీసుకోలేని పరిస్థితి నెలకొని యున్నది. దీనికి పరిష్కారముగా, తి.తి.దే వారు చిత్తూరు జిల్లాలో పలమనేరు నందు జాతీయ రహదారి ప్రక్కన సుమారు 700 ఎకరాలలో గోసంరక్షణ మరియు పశుగణాభివృద్ధి పరిశోధనా కేంద్రము స్థాపించుటకు భారీ సన్నాహాలు చేస్తున్నారు.

ఇతర వివరాలకు డైరెక్టర్‌, ఎస్‌.వి.గోసంరక్షణ శాల, తిరుపతి నందు సంప్రదించవలసినది. ఫోన్‌.నెం.0877 – 2264570.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.