శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం 

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, మార్చి-2, 2011: ఏప్రిల్‌ 4వ తారీఖున తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 29వ తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరంలో నాలుగు మార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, ఉగాదికి ముందు, ఆణివార ఆస్థానానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో నిర్వహించడం ఆనవాయితి.
             

మార్చి 29వ తారీఖున ఆలయంలో మొదటి గంట శాత్తుమొర అనంతరం ఉదయం 6గం|| నుండి ఉదయం 11గం|| లవరకు సుమారు 5గం||లపాటు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాదులతో కలిపిన తీర్థజలంతో గర్భాలయాన్ని శుద్ధి చేయడం ఈ తిరుమంజనం యొక్క ప్రత్యేకత. ఈ పరిమళ ద్రవ్యంలో  నామంకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, ఖిచిలిగడ్డ తదితర వస్తువులతో కూడి ఉంటుంది. ఈ సుగంధ భరిత మిశ్రమంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు.
             

గర్భాలయంలోని అన్ని ఉత్సవ విగ్రహాలు, బంగారు వెండి  పాతరలను బంగారు వాకిలి వరకు తెస్తారు. లోపల గోడలు, పై కప్పులు, ప్రధాన ఆలయం లోపలి ప్రాంగణంలో వెలసి ఉన్న చిన్నచిన్న గుళ్లను కూడా  అంతటా శుభ్రం చేసి ఒక మహాయజ్ఞంలా ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేస్తారు. ఈ  సందర్భంగా తితిదే ఆనాడు ఆలయంలో జరుపవలసిన అష్టదళ పాదపద్మారాధన సేవను మాత్రమే రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలు యధాతథంగా నిర్వహిస్తారు. కాగా కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం ఆర్జిత సేవలో పాల్గొ దలచిన భక్తులు, ఒక్కరికి రూ.300/-లు చెల్లించి పాల్గొనవచ్చును.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.