ఫిబ్రవరి 19వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

ఫిబ్రవరి 19వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి, ఫిబ్రవరి 08, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి 8.00 గంటల వరకు స్వామివారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు.
ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం శ్రీ కోదండరామస్వామి, 20వ తేదీ బుధవారం శ్రీ పార్థ సారథిస్వామి, 21వ తేదీ  గురువారం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి, 22వ తేదీ శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారి అవతారంలో స్వామివారు తెప్పపై విహరించ నున్నారు. మొదటి నాలుగు రోజులు స్వామివారు తెప్పపై ఐదు చుట్లు చుట్టనున్నారు. చివరి మూడు రోజులైన శని, ఆది, సోమవారాల్లో శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేయనున్నారు. చివరి రోజైన ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలోకి స్వామివారి వేంచేపు మరియు ఆస్థానం జరగనుంది.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
    –
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.