భద్రతాసిబ్బంది అటు సంస్థకు ఇటు భక్తులకు సంరక్షకులు కావాలి – తితిదే జె.ఇ.ఓ. డాక్టర్‌ యన్‌.యువరాజ్‌ 

భద్రతాసిబ్బంది అటు సంస్థకు ఇటు భక్తులకు సంరక్షకులు కావాలి – తితిదే జె.ఇ.ఓ. డాక్టర్‌ యన్‌.యువరాజ్‌

తిరుపతి, మార్చి-21, 2011: నిత్యం దేశవిదేశాల నుండి విచ్చేసే భక్తజనసందోహంతో కిటకిటలాడే తిరుమల- తిరుపతి దివ్యక్షేత్రాలకు భద్రతావలయాన్ని కల్పించడంతో పాటు అటు భక్తులకు  కూడా తగిన రక్షణను కల్పించడంలో తితిదే భద్రతాసిబ్బంది సంరక్షకులుగా బాధ్యతతో వ్యవహరించాలని తిరుమల – తిరుపతి దేవస్థానము సంయుక్త కార్యనిర్వహణాధికారి (తిరుపతి) శ్రీ డాక్టర్‌ యన్‌.యువరాజ్‌ అన్నారు.
           

తితిదే శ్వేత భవనంలో ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన 35 మంది భద్రతాసిబ్బందికి వారం రోజులపాటు నిర్వహించే శిక్షణాతరగతులు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ యువరాజ్‌ మాట్లాడుతూ సామాన్యంగా ప్రజలందరికి అరోగ్యమే మహాభాగ్యమన్నారు. అయితే నిత్యం జాగురూకతతో, మెలకువతో బాధ్యతలను నిర్వర్తించే భద్రతాసిబ్బందికి ఆరోగ్యం, దేహదారుఢ్యం అత్యంత అవసరమన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి ఉపద్రవాలు ఎదురైన అధైర్యపడకుండా మొక్కవోని పట్టుదలతో, అకుంఠిత దీక్షతో, సాహసంతో, సంయమనంతో, యుక్తితో తమ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అటు సంస్థకు ఇటు భక్తులకు సంరక్షకులుగా వ్యవహరిస్తూ తమ పనితనంలో ఇతరుల కంటే ప్రత్యేకతను ప్రదర్శించాలని ఆయన భద్రతాసిబ్బందికి పిలుపునిచ్చారు. ఇతర ప్రదేశాలలో ఉన్న భద్రతాసిబ్బందికి, తితిదే భద్రతాసిబ్బందికి ఎంతో తేడా వుందన్నారు. సాధారణంగా సామాన్య ప్రజానీకానికి రక్షణ కల్పించడమే భద్రతాసిబ్బంది కర్తవ్యమని అయితే తితిదే భద్రతాసిబ్బందికి భక్తులకు రక్షణను కల్పించి తద్వారా మానవసేవయే మాధవసేవ అన్న సిద్థాంతానికి కూడా అదర్శప్రాయంగా నిలబడాల్సిన బాధ్యత వుందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన అనంతరం అనంతపురం జిల్లా, చిలమత్తూరులోని సెక్యూరిటీ ట్రైనింగ్‌ అకాడమిలో ఒక నెలరోజుల పాటు వివిధ భద్రతా అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
             

అనంతరం తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్‌ మాట్లాడుతూ ఏ సంస్థకైనా భద్రత అనేది అత్యంత ప్రధానమైన అంశం అన్నారు. అందులోను తితిదే వంటి ప్రపంచ విఖ్యాత ధార్మిక సంస్థ భద్రతపైనే ప్రపంచం దృష్టి నేడు వుందన్నారు. ఈ నేపద్యంలో భద్రతా సిబ్బంది అత్యంత మెలకువతో, అప్రమత్తతతో సమర్థవంతంగా తమ విధులను నిర్వర్థించాల్సిన బాధ్యతవుందన్నారు. ధార్మిక సంస్థ సంరక్షకులుగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో భద్రతా సిబ్బంది తమ ఆహార, భాష, తీరుతెన్నులలో మార్పు తీసుకురావలసిన అవసరం వుందన్నారు. ఈ వారం రోజులపాటు జరిగే శిక్షణాతరగతులకు సంప్రదాయబద్దమైన దుస్తులతోనే రావలసి ఉంటుందన్నారు.
శ్వేత డైరెక్టర్‌ డాక్టర్‌ రామకృష్ణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో హిందూధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి, అదనపు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌రెడ్డి, తిరుపతి వి.జి.ఓ. శ్రీ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.