భాగవతంతో ఆధ్యాత్మిక విప్లవం : శ్రీ సముద్రాల లక్ష్మణయ్య

భాగవతంతో ఆధ్యాత్మిక విప్లవం : శ్రీ సముద్రాల లక్ష్మణయ్య

తిరుపతి, ఫిబ్రవరి 28, 2013: సామాన్య జనులలో ఆత్మతత్త్వం, విజ్ఞానాన్ని వ్యాపింపచేయడానికి కథలు, ఉపకథల ద్వారా భాగవతం ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని సాధించిందని పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య అన్నారు. తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వ్యాస భాగవతంపై  మూడు రోజులు పాటు జరిగిన సదస్సు గురువారం ముగిసింది.
 
ముగింపు కార్యక్రమంలో శ్రీ సముద్రాల లక్ష్మణయ్య ప్రసంగిస్తూ సంస్కృతంపై కొద్దిపాటి పరిజ్ఞానం ఉంటే మన సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలు గ్రహించవచ్చని వివరించారు.   భాగవతం వేదసారాన్ని చిన్న చిన్న కథల రూపంలో అందించిందని, దాని వల్ల సామాన్యజనులు కూడా మానవ జీవితానికి అవసరమైన ప్రయోజనాన్ని సాధించగలిగారని తెలిపారు.
 
అనంతరం రాజమండ్రికి చెందిన ఆచార్య కేశాప్రగడ సత్యనారాయణ ”ఉద్ధవగీతా ప్రాశస్త్యం”, తిరుపతికి చెందిన డాక్టర్‌ ఎ.శింగరాచార్యులు ‘ధ్రువోపాఖ్యానం’ అనే అంశాలపై ఉపన్యసించారు.
 
ఉదయం హైదరాబాదుకు చెందిన ఆచార్య మైలవరపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జరిగిన సాహితీ సమావేశంలో బెంగళూరుకు చెందిన ఆచార్య కె.నాగేశ్వరశాస్త్రి ”జడభరతోపాఖ్యానం”, తిరుపతికి చెందిన ఆచార్య కె.రామసూర్యనారాయణ ”నిగమకల్ప తరోర్గలితం ఫలం”, తిరుపతికి చెందిన డాక్టర్‌ ఆకెళ్ల విభీషణశర్మ ”ఉపనిషత్తులు – భాగవతం” అనే అంశాలపై ఉపన్యసించారు. అనంతరం ఉపన్యసించిన పండితులందరినీ సన్మానించారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.