KALIYA MARDHANA ON MUTHYAPUPANDIRI _ ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి 

TIRUPATI, 13 FEBRUARY 2023: In the avatar of Kaliyamardana Krishna, the Kalyana Venkateswara Swamy took a celestial ride on Mutyapupandiri Vahanam on Monday evening along with His consorts Sridevi and Bhudevi at Srinivasa Mangapuram.

The Lord blessed the devotees all along the mada streets on the pleasant evening during the ongoing annual event.

Special grade DyEO Smt Varalakshmi and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2023 ఫిబ్రవరి 13: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ముత్య‌పు పందిరి – స‌క‌ల సౌభాగ్య సిద్ధి

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీనివాసుడు మూడో రోజు రాత్రి ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ కుమార్, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, కంకణ బట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.