మే 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌ 28, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 16వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

17-05-13(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
18-05-13(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
19-05-13(ఆదివారం) సింహ వాహనం   ముత్యపుపందిరి వాహనం 20-05-13(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
21-05-13(మంగళవారం) మోహినీ అవతారం గరుడ వాహనం
22-05-13(బుధవారం) హనుమంత వాహనం గజ వాహనం
23-05-13(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24-05-13(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం
25-05-13(శనివారం) చక్రస్నానం ధ్వజావరోహణం
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

ప్రపంచంలోనే తిరుపతి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతకు మహోన్నతమైంది. యాత్రికులు తిరుపతి దగ్గరికి చేరుకోగానే గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం స్వాగతం పలుకుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్‌కు, బస్టాండుకు అతిదగ్గరగా ఈ ఆలయం ఉంది. ఈ స్వామి పేరుతోనే ప్రాచీనకాలంలో తిరుపతిని గోవిందరాజపట్నం అని పిలిచేవారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అన్నగా ప్రసిద్ధిచెందిన శ్రీ గోవిందరాజస్వామి శ్రీనివాసుని కల్యాణం కోసం ధనాన్ని కొలమానికతో కొలిచి కొలిచి అలసిపోయి ఆ కొలమానికనే తలగడ(దిండు)గా చేసుకుని సేద తీరినట్టు స్థానికుల కథనం.

గర్భగృహంలో సున్నంగారతో చేసిన శయనమూర్తి అయిన శ్రీ గోవిందరాజస్వామి విగ్రహం నెలకొని ఉంది. తలకింద స్వామివారికి తలగడ(కుంచెం),  నాభి నుండి ఉద్భవించిన పద్మంపై చతుర్ముఖ బ్రహ్మ, తూర్పు వైపున స్వామి పాదాలకు ఉత్తరంగా లక్ష్మీదేవి, ఉత్తరం వైపున దక్షిణాభిముఖంగా భూదేవి విగ్రహాలు ఉన్నాయి. స్వామి పాదాల చెంత మధుకైటభులనే రాక్షసుల విగ్రహాలు ఉన్నాయి. గోవిందరాజస్వామికి అభిముఖంగా గరుడ మండపం, ధ్వజస్తంభం, బలిపీఠాలతోపాటు సమీపంలోని ఎత్తైన ఒక చిన్న మండపంలో ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే ఆలయంలో ద్వారపాలకులతో పాటు వసంతమండపం, నీరాళిమండపం, చిత్రకూట మండపం, కుంభహారతి మండపం, లక్ష్మీదేవి మండపాలు, కల్యాణ మండపం, యాగశాల, అద్దాల మహల్‌ ఉన్నాయి. క్రీ.శ 1129-30 మధ్య కాలంలో రామానుజాచార్యులు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని తిరుపతిలో నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.