TTD CANCELS EVENING VIP BREAK DURING SUMMER VACATION _ వేసవి సెలవులయ్యేంత వరకు తిరుమలలో సాయంత్రం విఐపి బ్రేక్ దర్శనం రద్దు :తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వేసవి సెలవులయ్యేంత వరకు తిరుమలలో సాయంత్రం విఐపి బ్రేక్ దర్శనం రద్దు :
తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు
తిరుమల, ఏప్రిల్ 28, 2013: ఏప్రిల్ 29వ తేదీ సోమవారం నుండి వేసవి సెలవులు ముగిసేంత వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం తప్ప మిగతా రోజుల్లో సాయంత్రం విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్టు తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. తిరుమలలోని తితిదే కార్యనిర్వహణాధికారి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. సాధారణ రోజుల్లో 60 వేలుగా ఉన్న భక్తుల సంఖ్య వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజూ 80 వేల నుండి లక్షకు చేరుకుంటోందని వివరించారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలకమండలి సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.
కాగా లోక్‌సభ స్పీకర్ శ్రీమతి మీరాకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ రామచంద్రయ్య, తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహ ణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం కలిసి స్పీకర్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పుస్తకాలు అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల శ్రీమతి మీరాకుమార్ విలేకరులతో మాట్లాడుతూ 1980వ సంవత్సరంలో తన తల్లిదండ్రులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చానని గుర్తు చేసుకున్నారు. తిరిగి 33 ఏళ్ల తరువాత శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడంతో దివ్యానుభూతికి లోనయ్యానని తెలిపారు. దేశప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు ఆమె వెల్లడించారు. అంతకుముందు తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీమతి మీరాకుమార్ కుటుంబ సమేతంగా శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ చక్రపాణి, తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, ఉప కార్యనిర్వహణాధికారులు శ్రీ చిన్నంగారి రమణ, శ్రీ వెంకటయ్య, ఓఎస్‌డి శ్రీ దామోదరం, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.