రామవరంలో వైభ‌వంగా శ్రీనివాసుని కల్యాణం

రామవరంలో వైభ‌వంగా శ్రీనివాసుని కల్యాణం

తిరుపతి, 2010 ఏప్రిల్ 15: తిరుమల తిరుపతి దేవస్థానములు ఈనెల 9వ తేది నుండి నిర్వహిస్తున్న గిరిజన ప్రాంతాలలో గోవింద కల్యాణం కార్యక్రమంలో భాగంగా నేడు గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లాలోని  వై. రామవరం గ్రామంలో శ్రీనివాసుని కల్యాణం కన్నుల పండుగగా జరిగింది.

ఉదయం స్వామివారి సుప్రభాతసేవ, అర్చన, తోమాల సేవలు శాస్త్రబద్దంగా అత్యంత భక్తి శ్రద్దలతో జరిగాయి. గిరిజన అర్చకులు శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపండితులు ఈ కార్యక్రమంలో వేద మంత్రాలు పఠించగా అన్నమాచార్య కళాకారులు శ్రీవారిని స్థుతిస్తూ అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి టిటిడి ఇ.ఓ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు మాట్లాడుతూ గిరిజనులను ధార్మిక జీవనం వైపు మల్లించడం, గిరిజన అర్చకులను కల్యాణంలో భాగస్వామ్యం చేయడం, హైందవధర్మప్రచారాన్ని మారుమూల ప్రాంతాలలో ప్రచారం చేయడానికి ఈగోవింద కల్యాణాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంతో శ్రమకోర్చి సేవలను అందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించాడు. రానున్న రోజులలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో స్వామి వారి ప్రచార రథాలను తీసుకరావడానికి సంకల్పిస్తున్నామని అన్నారు. ప్రముఖ ఆశోక్‌లైలాండ్‌ సంస్థ ఈకార్యక్రమానికి తమవంతు బాధ్యతగా నాలుగు వాహనాలను (రథాలు) సమకూర్చడానికి ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు.

అదేవిధంగా శ్వేతాలో ఆయాప్రాంతాలలోని ఆలయాలలో పనిచేస్తున్న అర్చకులకు అర్చకత్వంపై శిక్షణ ఇస్తున్నామని అదేవిధంగా అర్చకత్వంపై అవగాహన కల్పించడానికి తద్వారా మారుమూల ప్రాంతాలలో హైదవ ధర్మప్రచారాన్ని కొనసాగించడానికి గిరిజన గొరవల్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆదివాసులు, గ్రామీణగిరిజనలు తదితరులతో తిరుమలకు విచ్చేసే లక్షలాదిమంది స్వామివారి భక్తులకు సేవచేయడానికి వీరికి శ్రీవారి సేవద్వారా అవకాశం కల్పిస్తున్నామని ఎవరైనా శ్రీవారి సేవలో పాల్గొని సేవ చేయవచ్చునని పిలుపునిచ్చారు.

ఏఫ్రిల్‌ 16వ తేదిన రాజమండ్రి సమీపంలోని రాజానగరం నందు శ్రీవారి లోకకల్యాణరథయాత్ర ప్రారంభమౌతుందని తెలిపారు.

అనంతరం స్థానిక ఎం.ఎల్‌.ఎ, తితిదే పాలకమండలి సభ్యులు రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఏడుకొండల వెంకన్న తిరుపతి నుంచి తమ ప్రాంతానికి విచ్చేసి మారుమూల ప్రాంతాలలోని గిరిజనులను ఆశీర్వదిస్తున్నారని ఇది మనకు పూర్వజన్మసుకృతమని అన్నారు. స్వామివారి కల్యాణాలను మారుమూల గిరిజనులు వీక్షించడానికి తూర్పుగోదావరి జిల్లాలోని 7,8 గ్రామాలలో స్వామివారి కల్యాణాలను ఏర్పాటు చేసామని అందరూ ఈ కల్యాణాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

ఈరోజు జరిగిన గోవింద కల్యాణానికి విచ్చేసిన గిరిజనులకు తితిదే డాక్టర్లు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అదేవిధంగా శ్రవణం ప్రాజెక్టుద్వారా వినికిడి లోపం వున్న పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. తితిదే ధర్మప్రచారపరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈకార్యక్రమానికి స్థానిక గిరిజనులే కాకుండా ఒరిస్సా, ఛతీష్‌గడ్‌ రాష్ట్రాల పరిసర ప్రాంత గిరిజనులు  విచ్చేసి స్వామివారి కల్యాణాన్ని తిలకించి పులకించారు. అనంతరం భక్తులందరికి స్వామివారి ప్రసాదాన్ని వితరణచేసారు. ఈ గోవింద కల్యాణంలో తూర్పుగోదావరి జిల్లా అడిసనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ బి.రామారావు, స్థానిక ఎం.పి.టి.సి. రమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, విశ్వహిందూపరిషత్‌ కార్యకర్తలు, శ్రీవారి సేవకులు, తితిదే అధికారులు రాళ్ళబండి కవితాప్రసాద్‌, డాక్టర్‌ మేడసాని మోహన్‌, చిలకపాటి విజయరాఘవాచార్యులు, తితిదే మెడికల్‌, ఆయుర్వేదిక్‌ డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.