విశ్వనాథలాంటి వారు  200 ఏళ్లు జీవించాలి : సద్గురు శివానందమూర్తి

విశ్వనాథలాంటి వారు  200 ఏళ్లు జీవించాలి : సద్గురు శివానందమూర్తి
 
తిరుపతి, జనవరి 05, 2013: తన రచనలతో వేదాంత సారాన్ని పంచి భారతీయతకు పెద్దపీట వేసిన విశ్వనాథ సత్యనారాయణ లాంటి వారు 200 ఏళ్లు జీవించి ఉంటే బాగుండేదని ప్రముఖ సంగీత గురువులు సద్గురు శివానందమూర్తి ఉద్ఘాటించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, విశ్వనాథ సాహితీ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగిన ”భారతీయ సాంస్కృతిక పరిరక్షణ – విశ్వనాథ సాహిత్యం” జాతీయ సదస్సు శనివారం సాయంత్రం ముగిసింది.
 
సదస్సు సమాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సద్గురు శివానందమూర్తి ప్రసంగిస్తూ ఈతరం వారు విశ్వనాథ సాహిత్యాన్ని చదివి ఆధ్యాత్మిక భారతావనిని నిర్మించాలని కోరారు. విశ్వనాథ సత్యనారాయణ లేని లోటును తీర్చుకునేందుకు భారతీయులందరిలో ఆయన్ను చూసుకుందామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. విశ్వనాథ రచనలను పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని, మరిన్ని పుస్తకాలను ముద్రించాలని కోరారు.
 
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసిన వెంటనే తిరుపతిలో తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇలాంటి జాతీయ సదస్సు జరగడం మన అదృష్టమన్నారు. విశ్వనాథవారి రచనలను ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవాలని, అప్పుడే తెలుగు భాష సుసంపన్నం అవుతుందని అన్నారు.
 
గౌరవ అతిథిగా హాజరైన శ్రీరంగంలోని సంప్రదాయ కైంకర్య నిర్వాహకులు డాక్టర్‌ ప్రేమా నందకుమార్‌ ప్రసంగిస్తూ విశ్వనాథవారి రచనలను ఇతర భాషల్లోకి అనువదించాలని, అప్పుడే భారతీయులందరికీ ఆ ఫలం అందుతుందని చెప్పారు. నేటి యువత మన సాంస్కృతిక మూలాలను రక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
అనంతరం తితిదే ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూపొందించిన, శ్రీ శివకుమార్‌ శర్మ ఆలపించిన ”శుక్ల యజుర్వేదం కాణ్వ శాఖ” వేదమంత్రాల సిడీలను సద్గురు శివానందమూర్తి  తితితే ఈవోతో కలసి ఆవిష్కరించారు. అలాగే ఎన్నో అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించిన శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ చిత్రపటాన్ని అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేయనున్నారు.
 
ఉదయం తితిదే ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ఆచార్య రవ్వా శ్రీహరి అధ్యక్షతన జరిగిన సదస్సులో ”భారతీయ సాంస్కృతిక పరిరక్షణ – నాటకాలు” అనే అంశంపై ప్రముఖ పండితులు ఉపన్యసించారు. తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య  ”గుప్తపాశుపతం”, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ కె.జె.కృష్ణమూర్తి ”త్రిశూలం”, కరీంనగర్‌కు చెందిన డాక్టర్‌ గండ్ర లక్ష్మణరావు ”వేనరాజు”, కర్నూలుకు చెందిన డాక్టర్‌ బి.మంగమ్మ ”నర్తనశాల”, కర్నూలుకు చెందిన డాక్టర్‌ పి.విజయకుమార్‌ ”అనార్కలి” అనే నాటకాలపై ప్రసంగించారు.
 
అంతకుముందు హిందూ ధర్మప్రచార పరిషత్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.చెన్నకేశవులు నాయుడు ”శబరి”, మైసూరుకు చెందిన డాక్టర్‌ హరనాథ్‌ ”వేయిపడగలు నవలాశిల్పం” అనే అంశంపై పరిశోధన పత్రాలు సమర్పించారు.
 
మధ్యాహ్నం తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌ సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.సత్య నారాయణరాజు అధ్యక్షతన ”భారతీయ సంస్కృతి-విశ్వనాథ” అనే అంశంపై సదస్సు జరిగింది. ఇందులో విజయవాడకు చెందిన శ్రీ అండవిల్లి సత్యనారాయణ ”నాకు తెలిసిన విశ్వనాథ”, హైదరాబాదుకు చెందిన శ్రీ సి.సుబ్బారావు ”విశ్వనాథ వ్యక్తిత్వం”, విజయనగరానికి చెందిన శ్రీ మానాప్రగడ శేషశాయి ”విశ్వనాథ స్మృతులు”, తిరుపతికి చెందిన డాక్టర్‌ కె.సర్వోత్తమరావు ”మధ్యాక్కఱలు”, తితిదే ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ ఆకెళ్ల విభీషణశర్మ ”విశ్వనాథ వేదసంస్కృతి”, హైదరాబాదుకు చెందిన శ్రీ యు.ఆత్రేయశర్మ  ”వివిధ ప్రక్రియలు” అనే అంశాలపై ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంతో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, విశ్వనాథ సాహిత్యపీఠం గౌరవాధ్యకక్షులు డాక్టర్‌ వెలిచాల కొండలరావు, డాక్టర్‌ లక్ష్మణమూర్తి, శ్రీ గౌరిపెద్ది వెంకట శంకర భగవాన్‌, అన్నమాచార్య ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.వాణి తదితరులు పాల్గొన్నారు.
 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.