వైకుంఠ ఏకాదశి మరియు ఆంగ్ల నూతన సంవత్సరాదికి తి.తి.దే స్థానిక ఆలయాలకు వెల్లువగా భక్తులు -తి.తి.దే ఇ.ఓ 

వైకుంఠ ఏకాదశి మరియు ఆంగ్ల నూతన సంవత్సరాదికి తి.తి.దే స్థానిక ఆలయాలకు వెల్లువగా భక్తులు -తి.తి.దే ఇ.ఓ

తిరుమల, 04 జనవరి 2013: వైకుంఠ ఏకాదశి మరియు ఆంగ్ల నూతన సంవత్సరాదికి తిరుమల శ్రీవారి ఆలయాన్ని తలపించే రీతిలో తిరుపతి మరియు ఇతర ప్రాంతాల్లోని తి.తి.దే సంబంధ ఆలయాల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విశేష సంఖ్యలో భక్తులు దైవదర్శనం చేసుకున్నారని తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం అన్నారు.
 
శుక్రవారం నాడు డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిశెంబరు 23 వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు మరియు నూతన ఆంగ్ల సంవత్సరాది జనవరి 1వ తారీఖున తి.తి.దే సంబంధ ఆలయాలైన శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట, చెన్నై సమాచార కేద్రం, బెంగుళూరు సమాచార కేంద్రం, కీళపట్టు కోనేటిరాయస్వామి ఆలయం, బుగ్గ అన్నపూర్ణసమేత కాశీవిశ్వేశ్వర ఆలయం మొదలైన ఆనేక తితిదే అనుబంధ ఆలయాల్లో వేలాదిగా భక్తులు దైవ దర్శనం చేసుకోవటం తి.తి.దే చరిత్రలోనే లిఖించదగ్గ విషయమని ఆయన అన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన తి.తి.దే ఇటీవల తన ఆధీనంలోనికి తీసుకున్న కీలపట్టులోని శ్రీ కోనేటిరాయస్వామి పురాతన దేవాలయానికి, ఈ ఆలయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆంగ్ల నూతన సంవత్సరాదినాడు ఒక్కరోజునే దాదాపు 28వేల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు.
 
అదే విధంగా చెన్నైలోని తి.తి.దే సమాచార కేంద్రంలో వెలసివున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారిని జనవరి 1వ తారీఖున రికార్డుస్థాయిలో 1,20,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవటం విశేషమన్నారు. ఇక బెంగుళూరులో 60వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారన్నారు.
 
తి.తి.దే ఉప ఆలయాలైన అలిపిరి పాదాల మండపంలో వైకుంఠ ఏకాదశి మరియు జనవరి 1వ తారీఖున చెరో 65వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారన్నారు. ఇక శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారిని 60 వేలమంది, అప్పళాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని 50వేల మంది, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారిని 25వేల మంది పైగా భక్తులు దర్శించుకోవటం విశేషమన్నారు.
స్థానిక ఆలయాల్లో తిరుమలకు సమానంగా భక్తులు విశేషసంఖ్యలో దర్శించుకోవటం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి. వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులను ఆయన అభినందించారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.