వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం 

వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, జనవరి 28, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం దాససాహిత్య ప్రాజెక్టు తలపెట్టిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం ఉదయం వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన దాదాపు 3000 మంది భక్తులు భజనలతో గోవిందనాథుని స్మరిస్తూ అలిపిరి మార్గంలో తిరుమలగిరులను అధిరోహించారు.
మొదటగా భక్తులు తితిదే మూడో సత్రం ప్రాంగణం నుండి తెల్లవారుజామున 4.00 గంటలకు అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. బెంగళూరు ఉత్తరాదిమఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మతీర్థులు, దాససాహిత్య ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌ శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య, అర్చకులు పాదాలమండపం వద్ద మెట్లపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యాత్మతీర్థులు ప్రసంగిస్తూ వేంకటేశ్వర మహత్యంలో మాధవుడు చెప్పినట్టు తిరుమలగిరులను తాకితేనే సర్వపాపాలు తొలగిపోతాయన్నారు. అలాంటిది భక్తులు తిరుమలకొండపైకి నడిచి వెళ్లడం పూర్వజన్మసుకృతమన్నారు.
శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ప్రసంగిస్తూ మెట్లోత్సవం విశిష్టతను తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో వచ్చిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు తెలిపారు. భజన మండళ్ల సభ్యులకు రెండు రోజుల పాటు తితిదే మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనలందు అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.