గాంధీ జీవితం విద్యార్థులకు మార్గదర్శకం : తితిదే జెఈవో 

గాంధీ జీవితం విద్యార్థులకు మార్గదర్శకం : తితిదే జెఈవో
తిరుపతి, జనవరి 30, 2013: మహాత్మాగాంధీ జీవితంలోని ప్రతి అంశమూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుందని తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తితిదే విద్యాసంస్థల విద్యార్థులకు ”గాంధీ” చలనచిత్రాన్ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గాంధీజీ జీవితచరిత్రను విద్యార్థులు తెలుసుకుని స్ఫూర్తిని పొందాలనే ఉద్దేశంతో ఈ చిత్ర ప్రదర్శనను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. గాంధీజీ చిన్నతనంలో చాలా భయస్తుడని, క్రమక్రమంగా భయాన్ని జయించి చదువులో రాణించారని వివరించారు. తన తల్లి పుతిలీభాయి నుండి భక్తిభావం, పట్టుదలను అలవరుచుకున్నారని చెప్పారు. అహంభావంతో కూడిన ప్రార్థన, సరైన ప్రవర్తన లేని విజ్ఞానం, మానవత్వం లేని సైన్స్‌ దుర్లభమని గాంధీ విశ్వాసమన్నారు. అహింస, సత్యం అనే ఆయుధాలతో స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టారని వివరించారు.
అనంతరం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సి.వెంకటరెడ్డి గాంధీజీ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన్ను జెఈవో శాలువతో సన్మానించారు. అంతకుముందు గాంధీజీ చిత్రపటానికి జెఈఓ పుష్పాంజలి ఘటించారు. అనంతరం మూడు గంటల నిడివి గల గాంధీ చలన చిత్రాన్ని తెలుగులో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాథ్‌, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.