శైవాగమ స్థాప‌కుడు శివుడు – డాక్టర్‌ కార్తికేయన్‌

శైవాగమ స్థాప‌కుడు శివుడు – డాక్టర్‌ కార్తికేయన్‌

తిరుపతి, 2010 మార్చి 05: తిరుపతి శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 3వ రోజు ఉదయం 11 గంటలకు సంస్కృత సదస్సు ప్రారంభమైనది. ఈసదస్సుకు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠంలో ఆచార్యులుగానున్న డాక్టర్‌ కె.ఇ. దేవనాథన్‌ గారు అధ్యక్షత వహించారు.

మొదట వేద విశ్వవిద్యాలయములో ఆచార్యలుగా నున్న డాక్టర్‌ కార్తికేయన్‌ గారు ”నిగమాగమములు సౌమ్యము – ఆగమ విచారము” అనే విషయంపై ప్రసంగించారు. ఆగమాలు జ్ఞానోపదేశం చేసే వాటిలో ప్రధానమైనవి, శైవాగమమును శివుడే స్థాపించాడని చెప్పారు. శైవాగమమం శివభేదం, రుద్రభౌదమని 2 విధాలన్నారు. ఇవి శివ ప్రతిష్ఠా, పూజాదుల గూర్చి తెలియజేస్తాయని చెప్పారు.

తరువాత డాక్టర్‌ కె. ఆనంత్‌ గారు ”వేదాలలో పంచమహాయజ్ఞాలు” అనే విషయంపై ప్రసంగిస్తూ యజ్ఞం ఇహ,పరలోకాల్లో సుఖాన్నిస్తుందన్నారు. తైత్తిరీయ ఆరణ్యకంలో 1. దేవయజ్ఞం 2. పితృయజ్ఞం 3.భూతయజ్ఞం 4. మనుష్యయజ్ఞం 5.బ్రహ్మయజ్ఞం అనే పంచమహాయజ్ఞాల గురించి చెప్పబడిందని వివరించారు.

డాక్టర్‌ రామచంద్రఝా గారు ”వైదిక జ్యోతిషతత్త్వం” అనే విషయంపై ప్రసంగిస్తూ జ్యోతిష్యం నేత్రం వంటిదని చెప్పారు.

డాక్టర్‌ కె.శ్రీనివాస శాస్త్రి గారు ”కృష్ణయజుర్వేదంలో ప్రకృతి విజ్ఞానం” అనే విషయంపై ప్రసంగిస్తూ వేదాలలో అనేక విజ్ఞాన విషయాలున్నాయని, సూర్యోపాసన వల్ల ఆయురారోగ్యాలు లబిస్తాయని చెప్పారు. శ్రీ ఓంకార సంయూకర్‌ గారు ”వేదాలలో సోమవేది స్వరూపం” అనే విషయంపై ప్రసంగిస్తూ వేదియజ్ఞ పురుషునికి ముఖం వంటిదని, హవిర్థాన మండపం శిరస్సని, యూపస్తంభంశిఖ అనీ చెప్పారు.

శ్రీప్రవారామకృష్ణ సోమయాజి గారు ”వైదిక ధర్మం సామాజిక శ్రేయస్సాధనం” అనే విషయంపై ప్రసంగిస్తూ ధర్మం వల్లనే దుఃఖంపోయి, సుఖం వస్తుందని, జగత్తును ధరించేది ధర్మమే అన్నారు.

శ్రాబెల్లం శ్రీనివాస సలక్షణ ఘన పాఠా గారు ”చతుర్వేద ప్రాశస్త్యం” అనే విషయంపై ప్రసంగిస్తూ వేల శాఖలు గల వేదాలకు ఇప్పుడు మొత్తం 12 లేదా 13 శాఖలు మాత్రమే మిగిలినాయి అన్నారు. వేదాలలో ఋగ్వేదం మొదటిదే అయినప్పటికి అందరు యజుర్వేదాన్నే మొదట చదువుతారని, యజుర్వేదం ఓంకార రూపమని, ఓంకారం యజూ రూపమని చెప్పారు. అందువలన దీనికి ప్రాధాన్యం వచ్చిందన్నారు. వర్లక్రమాధ్యయనం చేస్తేనే వేదాధ్యయనం పూర్తవుతుందని, లేనిచో అసంపూర్తి అధ్యయనం అవుతుందని అన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.