TIRUPPAVAI COMMENCES_ శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం

POURNAMI GARUDA SEVA ON DEC 19 

 

TIRUMALA, 17 DECEMBER 2021: With the advent of Dhanurmasam, Tiruppavai replaced Suprabhatam in Tirumala on Friday.

 

Ekanta Seva will be rendered to Sri Krishna Swamy till January 14.

 

Pournami Garuda Seva will be observed in Tirumala on December 19 between 7pm and 9pm. 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం

జనవరి 14వ తేదీ వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం

డిసెంబ‌రు 19న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఘనంగా ప్రారంభమైంది. డిసెంబ‌రు 16న గురువారం మ‌ధ్యాహ్నం 12.26 గంట‌ల‌కు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి. శుక్ర‌వారం నుండి 2022 జనవరి 14వ తేదీ వరకు ఆలయంలో సుప్రభాతం స్థానంలో శ్రీవారికి ఏకాంతంగా తిరుప్పావై నివేదిస్తారు.

పురాణ నేపథ్యంలో గోదాదేవి తాను ద్వాపరయుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

ధనుర్మాస వైశిష్ట్యం వివిధ పురాణాల్లో వివిధ విధాలుగా పేర్కొనబడింది. హైందవ సనాతన ధర్మానుసారం ఎవరైతే ఉదయాత్పూర్వం బ్రహ్మముహూర్తంలో కాలకృత్యాలు తీర్చుకొని భగవంతునికి భక్తిపూర్వకంగా పూజలు నివేదిస్తారో వారికి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని ప్రశస్తి. ధనుర్మాసంలో శ్రీవారిని మధుసూదనుడిగా ప్రత్యేకించి కీర్తిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్ సృష్టిని లయబద్దంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుండే శ్రీకారం చుడతాడని కూడా పురాణప్రసిద్ధి. ఈ కారణంగానే ధనుర్మాసంలో ఉదయాత్పూర్వం బ్రహ్మముహూర్త కాలంలో లేచి శుచిగా పూజలు చేస్తారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాళ్‌ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదాకల్యాణం మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు.

డిసెంబ‌రు 19న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 19న ఆదివారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.