శ్వేతలో తితిదే ఇంజినీర్లకు సమర్థ విద్యుత్‌ నిర్వహణపై శిక్షణ

శ్వేతలో తితిదే ఇంజినీర్లకు సమర్థ విద్యుత్‌ నిర్వహణపై శిక్షణ

తీవ్ర విద్యుత్‌ కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థవంతంగా దాన్ని వాడుకునేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై తితిదేలోని ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లకు తిరుపతిలోని శ్వేత భవనంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాల్లో తితిదే విద్యుత్‌ విభాగం రూపొందిస్తున్న విద్యుత్‌ కటౌట్లకు భక్తుల నుండి విపరీతమైన స్పందన వస్తోందన్నారు. కీలకమైన ఈ విభాగంలోని ఇంజినీర్లకు వారి రంగంలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్‌ ఆదా పద్ధతులు తదితర విషయాలను తెలియజేసేందుకు ఈ శిక్షణ తరగతులు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఇంజినీర్లు రోజువారీ తమకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకుని వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు. మొదటిరోజు ఎస్‌పిడిసిఎల్‌ తిరుపతి డివిజనల్‌ ఇంజినీర్లు శ్రీ ఎస్‌.మునిశంకరయ్య, డి.మురళీధరబాబు శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్స్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీ ఎ.వెంకటేశ్వర్లు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.