COLOURFUL ART FORMS DURING PEDDASESHA VAHANAM _ పెద్దశేష వాహనంపై శ్రీవారి వైభవం – కళాబృందాల కనువిందు

Tirumala, 15 September 2026: The colourful Cultural performances by various troops from nine states enthralled devotees in Tirumala on Tuesday evening in front of Pedda Sesha Vahana seva.

Tirumala turned into a vibrant cultural spectacle on the first evening of ongoing Brahmotsavams with 19 cultural teams comprising 549 artistes from 09 states and entertained devotees with traditional music, dance and folk performances.

Artists from Andhra Pradesh, Odisha, Telangana, Tamil Nadu, Assam, Maharashtra, Manipur, Puducherry and Uttar Pradesh presented a variety of cultural programmes that captivated the devotees gathered in Tirumala.

The performances of Kuttrala Kuravanji, Assam’s popular Bihu dance and Tamil Nadu’s traditional Oyilattam were the major attractions of the day.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

పెద్దశేష వాహనంపై శ్రీవారి వైభవంకళాబృందాల కనువిందు

9 రాష్ట్రాల నుంచి 19 కళాబృందాలు.. 549 మంది కళాకారుల ఆటపాటల సందడి

తిరుమల, సెప్టెంబరు 15, 2026: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాత్రి జరిగిన పెద్దశేష వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు ఆదిశేషుని ప్రతిరూపమైన పెద్దశేషునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీవారి పెద్దశేష వాహనసేవను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దేశంలోని భిన్న ప్రాంతాల కళా, సాంస్కృతిక వైభవాన్ని తిరుమలలో ఆవిష్కరిస్తూ 9 రాష్ట్రాల నుంచి 19 కళాబృందాలకు చెందిన 549 మంది కళాకారులు తమ నృత్యాలు, జానపద కళలు, సంగీత ప్రదర్శనలతో తిరుమలను కళా వైభవానికి వేదికగా మార్చారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు తమ ప్రాంతాల సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి. వివిధ రాష్ట్రాల జానపద, శాస్త్రీయ కళల సమ్మేళనం భక్తులకు కనువిందు చేసింది.

కుట్రాల కురవంజి ప్రత్యేక ఆకర్షణ

తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ కుట్రాల కురవంజి తొలిరోజు కళా ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాసుడు–పద్మావతి పరిణయాన్ని ప్రతిబింబించే కథాంశాన్ని నృత్యం, సంగీతం, అభినయంతో కళాకారులు హృద్యంగా ఆవిష్కరించారు.

రంగురంగుల సంప్రదాయ ఆహార్యంతో కళాకారుల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

బిహూ నృత్యంతో అస్సాం సంస్కృతి వైభవం

అస్సాం రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక బిహూ నృత్యం కూడా భక్తులను అలరించింది. సంప్రదాయ వస్త్రధారణలో యువతీ యువకులు జంటలుగా ఉత్సాహభరితంగా చేసిన వేగవంతమైన చేతులు, నడుము, పాదాల కదలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బిహూ గీతాల లయకు అనుగుణంగా సాగిన ఈ ప్రదర్శన ద్వారా అస్సాం సంస్కృతి వైభవం ప్రతిబింబించింది.

ఒయ్యాలట్టం..

లయబద్ధమైన జానపద నృత్యం

తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన సంప్రదాయ జానపద కళారూపం ఒయ్యాలట్టం భక్తులను ఆకట్టుకుంది. డప్పు, తాళాల లయకు అనుగుణంగా కళాకారులు బృందంగా ప్రదర్శించిన నృత్యం, రంగురంగుల రుమాళ్లతో చేసిన లయబద్ధమైన విన్యాసాలు చూపరులను అలరించాయి.

వారణాసి కళాకారుల శ్రీమద్రామాయణ రూపకం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన శ్రీమద్రామాయణ రూపకం భక్తులను భక్తిభావంలో ముంచెత్తింది. రామాయణంలోని ఘట్టాలను నృత్య, సంగీత, అభినయ రూపాల్లో ప్రదర్శించి శ్రీరాముని మహిమను చాటిచెప్పారు.

వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన కోలాటాలు, డప్పు, డ్రమ్ము విన్యాసాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్దశేష వాహనసేవ సందర్భంగా తిరుమలలో మార్మోగిన భిన్న రాష్ట్రాల జానపద సంగీతం, నృత్యాలు భారతీయ సంస్కృతిలోని “భిన్నత్వంలో ఏకత్వం” అనే గొప్ప సందేశాన్ని చాటిచెప్పాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కళా ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భారతీయ కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించే అరుదైన అవకాశం కల్పిస్తున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.