ANKURARPANA PERFORMED IN SKVST_ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati, 14 October 2017: In connection with annual Pavitrotsavams in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram, Ankurarpana was performed on Saturday evening.

Meanwhile the Pavitrotsavams will be observed from October 15 to 17 for three days. TTD has cancelled Kalyanotsavam during these three days and Swarnapushparchana seva on October 17.

During these three days, there will be Snapana Tirumanjanam in the morning and procession of deities on golden Tiruchi in the evening. On first day Pavitra Pratistha, second day Pavitra Samarpana and on final day Pavitra Purnahuti will be observed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2017 అక్టోబరు 14: శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అక్టోబరు 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించనున్నారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 15వ తేదీన ఉదయం 7.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబరు 16వ తేదీన ఉదయం 9.00 నుండి 10.30గంటల వరకు స్నపనతిరుమంజనం, ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. సాయంత్రం వీధి ఉత్సవం జరుగనుంది. చివరిరోజు అక్టోబరు 17వ తేదీన ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుండి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, అక్టోబరు 17వ తేదీన స్వర్ణపుష్పార్చన సేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ సందర్భంగా ప్రతిరోజూ తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఏఈవో శ్రీధనంజయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.