ఆగస్టు 1 నుండి తిరుమలలో శ్రీ జయతీర్ధుల ఆరాధనోత్సవం

ఆగస్టు 1 నుండి తిరుమలలో శ్రీ జయతీర్ధుల ఆరాధనోత్సవం

జూలై 31, తిరుమల 2018: ఆగస్టు 1 నుండి 3వ తేదీ వరకు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని కళ్యాణ వేదికలో శ్రీ జయతీర్ధుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగనుంది.

ఇందులోభాగంగా ప్రతిరోజు కళ్యాణ వేదికలో ఉదయం 5.30 నుండి 7.00 గంటల వరకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 3000 మంది భజనమండళ్ల కళాకారులతో సుప్రభాతం, ధ్యానం, అనంతరం పీఠాధిపతులు మంగళాశాసనములు ఉన్నాయి. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు దాస సాహిత్య కళాకారులతో ” శ్రీ జయతీర్థుల సంకీర్తన”, ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు పండితులతో ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు సామూహిక సంకీర్తన – సంగీత విభావరి కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ బెంగుళూరు శ్రీ రాఘవేంద్ర మఠముకు చెందిన శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ, ఆగస్టు 2వ తేదీ తీర్థహళ్ళి భీమసేతు మునివృంద మఠముకు చెందిన శ్రీశ్రీశ్రీ రఘువరేంద్రతీర్థ స్వామీజీ, ఆగస్టు 3వ తేదీ ఉడిపిలోని కాణ్యూర్‌ మఠముకు చెందిన శ్రీశ్రీశ్రీ విద్యావల్లభతీర్థ స్వామీజీలు మంగళాశాసనములు ఇవ్వనున్నారు.

చారిత్రక ప్రాశస్త్యం

”శ్రీ జయతీర్ధులవారు” చిన్నవయస్సులో అప్రతిమ ప్రజ్ఞాపాటవము గలవారైయుండిరి. వీరు ఇంద్రుని అవతారమని జ్ఞానులు చెప్పుచున్నారు. మధ్వాచార్యులు కాలములో వీరు ఒక వృషభరూపాన్ని (ఎద్దు రూపమును)ధరించి మధ్వగ్రంథ భారమును వహించిరి. శ్రీ మధ్వాచార్యులు శిష్యులైన శ్రీ అక్షోభతీర్ధుల ద్వారా సన్యాసాశ్రమాని పొంది, జయతీర్ధులుగా నామకరణము చేసిరి.

ద్వైతసిద్ధాంత ప్రతిష్టాపనాచార్యులు అయిన శ్రీ మధ్వాచార్యులు ఆసేతు హిమాచలం సంచరించి శిష్యులకు సత్‌ సిద్ధాంతమును ప్రచారము చేస్తు 37 గ్రంథాలకు పైగా రచించారు. శ్రీ జయతీర్ధులవారు పూర్వజన్మలో వృషభరూపమున శ్రీ మధ్వాచార్యుల సన్నిధిలో వుంటూ ద్వైతసిద్ధాంతభావమును పూర్తిగా శ్రవణము చేసిన ప్రభావముతో తరువాత జన్మలో ఈ గ్రంథములకు వ్యాఖ్యానం వ్రాసి టీకాచార్యులని ప్రసిద్ధి పొందిరి. వీరి సాహిత్యమును శ్రీ పురందరదాసులు గ్రహించి అపార కీర్తనలు రచించారు.

శ్రీ జయతీర్థులవారు 1363వ సంవత్సరం మహారాష్ట్రలోని మంగళవేడిలో జన్మించారు. ఆయన 1388వ సంవత్సరం వరకు 18 గ్రంథాలకు వాఖ్యానం, 3 గ్రంథాలను రచించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.