DEVOTIONAL BOOKS INAUGURATED _ పెద్దశేష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
TIRUPATI, 29 NOVEMBER 2024: On the second day as a part of the ongoing annual brahmotsavams at Tiruchanoor, devotional books printed by TTD were inaugurated on Friday.
TTD EO Sri J Syamala Rao released these books at Vahana Mandapam during Pedda Sesha Vahana Seva.
The books included Kavya Prabandhalalo Adhyatmika Kathalu-visleshana by Sri Erra Pragada Ramakrishna, Betala Panchavimsati by Acharya Remilla Venkata Ramakrishna Sastri, Matrusri Tarigonda Vengamamba Jeevana Charitra by Acharya T. Viswanatha Rao, Upadesatrayam by Sri Vavilikolanu Subbarao.
TTD EO felicitated the authors on the occasion. Annamacharya Project Director Dr Vibhishana Sharma, Sub-Editor Dr Narasimhacharyulu were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పెద్దశేష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుపతి, 2024 నవంబరు 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఉదయం జరిగిన పెద్దశేష వాహన సేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్కరించారు.
కావ్యప్రబంధాలలో ఆధ్యాత్మిక కథలు – విశ్లేషణ : శ్రీ ఎర్రా ప్రగడ రామకృష్ణ
కావ్యములు చెప్పదలచుకున్న ధర్మాన్ని చక్కగా సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి. అటువంటి కావ్యాలలో ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధాలైన కథలు అనేకం ఉన్నాయి. అటువంటి కథలను సేకరించి చక్కటి సులభమైన భాషతో నేటి తరానికి అర్థమయ్యేరీతిలో ఉదాహరణలతో ‘కావ్యప్రబంధాలలో ఆధ్యాత్మిక కథలు- విశ్లేషణ’’ అనే శీర్షిక ద్వారా అందించారు.
ఈ గ్రంథంలోని 15 శీర్షికల ద్వారా సామాజిక చైతన్యాని, వ్యక్తి తన కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతను తెలుసుకొని ధర్మమార్గం వైపు పయనిస్తాడు.
బేతాళ పంచవింశతి – ఆచార్య రేమిల్ల వేంకటరామకృష్ణశాస్త్రిగారు.
ప్రాచీన భారతీయవ్మాయంలో కథాసాహిత్యానికి విశేషమైన స్థానమున్నది. సమాజానికి తెలియజేయవలసిన విషయాన్ని కథా కథనరీతిలో తెలియజేస్తే అది సమాజానికి త్వరగా చేరుతుంది. ఇట్టి కథాసాహిత్యాలు అనేకమున్నా వాటిలో బేతాళ పంచవింశతి విశేష ఆదరణను పొందింది.
పంచవింశతి అంటే 25. తనను వశము చేసుకోవాలని ప్రయత్నించిన విక్రమార్కమహారాజుతో బేతాళుడు అనే రాక్షసుడు 25 రాత్రులు చెప్పిన సమస్యాత్మక కథలే ఈ ‘బేతాళ పంచవింశతి’ ఈ కథలన్నీ ఉత్కంఠభరితంగా సాగుతూ చివరకు చిక్కుముడిగల ప్రశ్నలతో ముగుస్తాయి. ఆ ప్రశ్నలకు విక్రమార్కమహారాజు తన తెలివితేటలను నిరూపించుకొంటూ ధర్మబద్ధమైన, తర్కబద్ధమైన సమాధానాలను తెలియజేయడం ఇందులోని విశేషం.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవనచరిత్ర – ఆచార్య టి.విశ్వనాథరావు
తిరుమల శ్రీవేంకటేశ్వరాస్వామివారిని సేవించి తన సంకీర్తనలతో అర్చించి తరించిన మహాకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. వివిధ ప్రక్రియలలో అష్టాదశ గ్రంథాలను రచించిన తరిగొండ వెంగమాంబ శ్రీనివాసుని తన భర్తగా భావించుకున్న పరమ సాధ్వీశిరోమణి. తన జీవితకాలంలో సమకాలీన సమాజం నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వాటన్నిటిని శ్రీవేంకటేశ్వరునికే సమర్పించి సకల జీవులలోను సర్వాంతర్యామి అయిన ఆ శ్రీహరినే దర్శించింది. ఈమె పేరునే ప్రతిరోజు శ్రీనివాసుని ఏకాంతసేవలో ముత్యాలహారతి సమర్పించబడుతుంది.
ఇంతటి మహనీయురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను సమస్త భక్తజనావళికి తెలియజేసే ఉద్దేశంతో టీటీడీ తెలుగులో ఇదివరకే వెలువడిన ఈ గ్రంథాన్ని హిందీ, ఇంగ్లీషు భాషలలో అనువదింపజేసి ముద్రిస్తున్నది.
ఉపదేశత్రయం – శ్రీ వావిలికొలను సుబ్బారావు
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి విశేష సేవ చేసిన శ్రీ వావిలికొలను వారి రచనలను, టీటీడీ ముద్రించాలని నిర్ణయించింది. అందులో భాగమే ఈ ‘‘ఉపదేశత్రయము’’. ఈ ఉపదేశత్రయంలో మూడు భాగాలున్నాయి. 1. మేలుకొలుపు 2. హనుమదాచార్యోపదేశము 3. సీతోపదేశము.
ఈ మూడు ఉపదేశాలు మానవుడు తన జీవితాన్ని సక్రమమార్గంలో నడిపించుకొనేందుకు ఉపకరిస్తాయి.
సంపూర్ణ మానవ జీవితవికాసంకోసం చతురాశ్రమధర్మాలను వివరిస్తూ హనుమంతుడు ఆచార్యుడుగా రామాయణంలో తన పాత్రను నిర్వహించిన విధానాన్ని ‘హనుమదాచార్యోపదేశము’ వివరిస్తుంది.
రామాయణంలోని సీత పాత్రద్వారా మనం తెలుసుకోదగ్గ ఉపదేశాన్ని ‘సీతోపదేశం’ వివరిస్తుంది. ధర్మచింతన పరాయణులైన భక్తులు చదివి తమ జీవితాలను సక్రమ మార్గంలో మలచుకొనేందుకు ఈ ఉపదేశత్రయం గ్రంథం ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి గౌతమి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఉపసంపాదకులు డా. నరసింహాచార్య, రచయితలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.