Dr. Babu Jagjivan Ram 106th Jayanthi Celebrations  _ జగ్జీవన్‌రామ్‌ కార్యదీక్ష ఉద్యోగులకు స్ఫూర్తిదాయకం : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

Dr. Babu Jagajivan Ram, 106th Jayanthi Celebrations held in TTD Adm Bldg in Tirupati on APRIL 5.
 
TTD Executive Officer Sri L.V.Subramanyam,  Joint Executive Officer Sri P.Venkatarami Reddy, Sri K.S.Sreenivasa Raju, CV&SO Sri GVG Ashok Kumar, ,Speakers Sri Chinna Narayana, Sri Kittanna, Sri Ala Narayana, Sri Bhaskar Reddy, Spl Gr DyEO(Welfare) and others were present.

జగ్జీవన్‌రామ్‌ కార్యదీక్ష ఉద్యోగులకు స్ఫూర్తిదాయకం : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

తిరుపతి, ఏప్రిల్‌ 05, 2013: నిమ్నకులంలో జన్మించి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దేశానికి ఉప ప్రధానిగా ఎదిగిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ కార్యదీక్షను ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకోవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సూచించారు. డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ 106వ జయంతి వేడుకలను తితిదే పరిపాలనా భవనంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ భారతీయ సమాజంలో అస్పృశ్యత నివారణకు కృషి చేసిన మహోన్నతుడు జగ్జీవన్‌రామ్‌ అని కొనియాడారు. అతిచిన్న వయసులోనే పార్లమెంటుకు ఎన్నికై అప్పట్లో రికార్డు సృష్టించారని అన్నారు. కేంద్రమంత్రిగా ఏ శాఖలో పనిచేసినా పూర్తిస్థాయి ఫలితాలు సాధించారని తెలిపారు. వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద సవాల్‌గా ఉన్న ఆహారధాన్యాల కొరతను అధిగమించగలిగారని వివరించారు. బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులు సామాజికంగా ఎదగాలన్న ఆశయంతో ముందుకు సాగాలన్నారు. న్యూనతాభావం ఉంటే వ్యక్తి వికాసం ఆగిపోతుందని, దాన్ని దూరం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమానికి ఉపన్యాసకులుగా విచ్చేసిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ హెరిటేజ్‌ సంచాలకులు డాక్టర్‌ అల నారాయణ ప్రసంగిస్తూ ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం దళితులకు చేస్తున్న సేవ శ్లాఘనీయమన్నారు. ఉద్యోగులు కలసిమెలసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మంచి సంప్రదాయమని కొనియాడారు. జగ్జీవన్‌రామ్‌ 78 సంవత్సరాలు జీవిస్తే 50 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పార్లమెంటేరియన్‌గా ఉన్నారని, ఇందులో 30 ఏళ్ల పాటు వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారని వెల్లడించారు. బడుగుల ఉద్ధరణ కోసం ఆయన ఆవిశ్రాంత పోరాటం చేశారని కొనియాడారు. అనంతరం కర్నూలుకు చెందిన వ్యవసాయ శాఖ రిటైర్డ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీ కె.చిన్ననారాయణ, ఐతేపల్లికి చెందిన తెలుగు భాషా పండితులు శ్రీ నెమిలేటి కిట్టన్న ప్రసంగిస్తూ జగ్జీవన్‌రామ్‌ జీవిత విశేషాలను సమగ్రంగా వివరించారు.

అంతకుముందు తితిదే ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీ ఎల్లప్ప, శ్రీ వెంకటేశ్‌, శ్రీ భాస్కర్‌, శ్రీమతి ఇందిర తదితరులు ప్రసంగించారు. అనంతరం ఉపన్యాసకులకు తితిదే ఈవో సన్మానం చేసి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి,  తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, ఉప కార్యనిర్వహణాధికారులు శ్రీ టి.ఏ.పి.నారాయణ, శ్రీ భాస్కర్‌రెడ్డి, ఎస్‌సి సెల్‌ లైజన్‌ ఆఫీసర్‌ శ్రీ బి.మనోహరం, ఎస్‌టి సెల్‌ లైజన్‌ ఆఫీసర్‌ శ్రీ డి.వేణుగోపాల్‌, ఏఈవో శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్‌, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో తితిదే ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది