ఏప్రిల్‌ 7న తిరుమలలో శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 510వ వర్ధంతి ఉత్సవాలు

ఏప్రిల్‌ 7న తిరుమలలో శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 510వ వర్ధంతి ఉత్సవాలు

తిరుమల, ఏప్రిల్‌ 05, 2013: పదకవితా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి ఉత్సవాలను తితిదే ఏప్రిల్‌ 7వ తేదీన తిరుమలలో ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా తిరుపతి, తిరుచానూరు, తాళ్లపాక, దేవుని కడప ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

తిరుమలలో ఏప్రిల్‌ 7వ తేదీ ఆదివారం ఉదయం 8.00 గంటలకు శ్రీవారి ఆలయం నుండి ఉభయ నాంచారులతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు ఊరేగింపుగా బయలుదేరతారు. ఉదయం 8.30 గంటలకు నారాయణగిరి ఉద్యానవనానికి స్వామివారు వేంచేస్తారు. అక్కడ అహోబిలం 45వ పీఠాధిపతి శ్రీమాన్‌ శఠగోప నారాయణ మహాదేశికన్‌ స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ”దినము ద్వాదశి” సంకీర్తనలు మరియు ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం తాళ్లపాక వంశీయులను తితిదే సన్మానించనుంది.

అదేవిధంగా తిరుమలలోని ఆస్థానమండపంలో ఆదివారం ఉదయం 11.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు తొమ్మిది మంది ప్రముఖ సంగీత విద్వాంసులు సంగీత సభలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.