హ‌రిత‌శోభితంగా తిరుమ‌ల : టిటిడి డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
హ‌రిత‌శోభితంగా తిరుమ‌ల : టిటిడి డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు

సెప్టెంబరు 16, తిరుమల 2018: ఐదేళ్ల ప్ర‌ణాళికలో భాగంగా 5 ల‌క్ష‌ల మొక్క‌లు నాటి తిరుమ‌ల‌ను హ‌రిత‌శోభితంగా తీర్చిదిద్దుతామ‌ని టిటిడి డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎఫ్‌వో మాట్లాడుతూ టిటిడి ప‌రిధిలో తిరుమ‌ల‌లో 3 వేల హెక్టార్ల ప‌రిధిలో అట‌వీ ప్రాంతం ఉంద‌న్నారు. ఇందులో ఎర్ర‌చంద‌నం, శ్రీ‌గంధం, ప‌లు ఔష‌ధ మొక్క‌లు పెంచుతున్నామ‌ని చెప్పారు. 100 హెక్టార్ల‌లో శ్రీ‌గంధం వ‌నం, 20 హ‌క్టార్ల‌లో మిరియాల వ‌నం పెంచుతున్న‌ట్టు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1, జిఎన్‌సి టోల్‌గేట్‌, అలిపిరి, భ‌క్తులు సంచ‌రించే అన్ని ప్రాంతాల్లో ఆహ్లాదక‌ర వాతావ‌ర‌ణం కోసం వివిధ ర‌కాల పూల మొక్క‌లు పెంచుతున్న‌ట్టు వివ‌రించారు. అలిపిరి న‌డ‌క మార్గంలో సువాస‌న వెద‌జ‌ల్లే మొక్క‌లు, రంగురంగుల పూల మొక్క‌లు పెంచామ‌ని తెలియ‌జేశారు. త‌మ విభాగంలో 8 మంది అధికారులు, 500 మంది సిబ్బంది ప‌ని చేస్తున్న‌ట్టు తెలిపారు. వేస‌విలో అడ‌విలో అగ్నిప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా 150 మంది సిబ్బందితోపాటు తిరుమ‌ల‌లో 4, తిరుప‌తిలో 4 వాచ్ ట‌వ‌ర్ల ద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని వివ‌రించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.