TTD AIMS AT PROTECTING DESI COWS-TTD TRUST BOARD CHIEF_ గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం: టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirupati, 23 Aug. 19: One of the chief mottoes of TTD is to safeguard and enhance the produce of Desi Cows as a part of Hindu Sanatana Dharma, said TTD Chairman Sri YV Subba Reddy.

The TTD board chief graced the Gopuja Mahotsavam at SV Gosala in Tirupati on the occasion of Sri Krishna Janmashtami fete on Friday. Speaking on this occasion, he said there are about 2991 cattle in SV Dairy Farm as well in Palamaner Goshala owned by TTD. These cows comprises of nearly 39 Desi breeds. “We want to enhance their number by safeguarding the indigenous cow breeds”, he added.

Earlier special abhishekam was performed to the presiding deity of Sri Venugopala Swamy followed by Gopuja event.

Govt Whip Sri Chavirreddy Bhaskar Reddy, Palamaner MLA Sri Venkatesh Goud, CVSO Sri Gopinath Jatti, SV GO Samrakshana Shala Director Dr. K Harinath Reddy, DyEO Smt Varalakshmi and others were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం: టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

ఎస్వీ గోశాలలో ఘనంగా గోకులాష్టమి ‘గోపూజ’

తిరుపతి, 2019 ఆగ‌స్టు 23: వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. టిటిడికి చెందిన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్ర‌వారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్ర‌భుత్వ విప్ మ‌రియు తుడా ఛైర్మ‌న్ శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ పాల్గొన్నారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి ఛైర్మ‌న్ మాట్లాడుతూ మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్ముడని, శ్రావణమాసం కృష్ణ పక్షం అష్టమి తిథినాడు శ్రీకృష్ణుడు జన్మించాడని తెలిపారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని హిందువులు కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి పేర్లతో పర్వదినంగా జరుపుకుంటారని, వివిధ రకాల ఫలాలు, అటుకులు, వెన్న, పెరుగు, మీగడ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారని వివరించారు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకుంటే గోదానం చేసిన ఫలితం వస్తుందన్నారు.

తిరుమ‌ల, తిరుప‌తి. తిరుచానూరు, ప‌ల‌మ‌నేరుల‌లో 2991 గోవులు ఉన్న‌ట్లు తెలిపారు. ఇందులో దాదాపు 39 ర‌కాల దేశవాళీ గోవుల జాతులు ఉన్నాయ‌ని, వీటిని సంరక్షించి వ్యాప్తి చేసేందుకు విశేషకృషి జరుగుతోందన్నారు. పలమనేరులో ఆధునిక వసతులతో 450 ఎకరాల్లో గోశాల ఏర్పాటు చేస్తున్నామని, రూ.40.77 కోట్ల‌తో గోశాల‌ల అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక‌లు రూపొందించి, అమ‌లు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇక్కడి గోశాల నుండి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం, ఇత‌ర టిటిడి అనుబంధ ఆలయాలకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలియజేశారు.

అంత‌కుముందు ప్ర‌భుత్వ విప్ మ‌రియు తుడా ఛైర్మ‌న్ శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి మాట్లాడుతూ గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు టిటిడి గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల‌న్నారు. గోశాల‌లో కనుమ పండుగ రోజున, గోకులాష్ట‌మి గోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీ గోశాల‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కాగా గోపూజ మహోత్సవంలో భాగంగా ఇటీవ‌ల నూత‌నంగా నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర గో మందిరంలో టిటిడి ఛైర్మ‌న్ గో పూజ నిర్వ‌హించారు. అనంత‌రం శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

అంత‌కుముందు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, వేణుగానం, ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం, భజనలు, కోలాటం, అన్నమాచార్య సంకీర్తనాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పిడ‌బ్ల్యు విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో హరికథ వినిపిస్తారు.

ఈ కార్యక్రమంలో ప‌ల‌మ‌నేరు ఎమ్ఎల్ఏ శ్రీ వేంక‌టేష్ గౌడ్‌, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, గోశాల సంచాలకులు డా|| కె.హరనాథరెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతివరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.