GOSEVA MEANS OFFERING PRAYERS TO DIVINE FRATERNITY _ గో సేవతో సమస్త దేవతలనూ పూజించిన ఫలితం: కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి

Tirupati, 2 Dec. 20: Go Seva is equal to worshipping all three crore deities present in Hindu Sanatana Dharma, advocated, the Kanchi Mutt Pontiff HH Sri Vijayendra Saraswathi Swamy.

The Seer visited Saptha Go Pradakshina Mandiram which is under construction at Alipiri Padala Mandapam along with Board Member Sri Sekhar Reddy.

The officers informed the seer thata Go Tulabharam and Go Sadan are coming up with all facilities.

CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, Gosala Director Dr Harinath Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTD, TIRUPATI

గో సేవతో సమస్త దేవతలనూ పూజించిన ఫలితం : కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 02: గోమాతను పూజించడం ద్వారా సమస్త దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అన్నారు. అలిపిరి పాదాల మండపం సమీపంలో  టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు శ్రీ శేఖర్ రెడ్డి  సహకారంతో నిర్మిస్తున్న సప్త గో ప్రదక్షిణ మందిరంను బుధవారం సాయంత్రం స్వామి పరిశీలించారు.

ప్రదక్షిణ మందిరం ముందు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ స్వామి విగ్రహానికి స్వామి పూలమాలలు వేసి పూజించారు. గో ప్రదక్షిణ శాలలో 24 గంటలూ ఏడు గోవులు ఉంటాయని అధికారులు శ్రీశ్రీశ్రీ  విజయేంద్ర సరస్వతి కి వివరించారు. తిరుమలకు నడకదారిలో వెళ్లే భక్తులు, వాహనాల్లో వెళ్ళే భక్తులు వేర్వేరు ద్వారాల ద్వారా వచ్చి గో ప్రదక్షిణ చేసుకుని వెళ్లే ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. ఇదే ప్రాంతంలో గో తులాభారం మందిరం తో పాటు సుమారు 30 గోవులు ఉండటానికి అన్ని సదుపాయాలతో  గో సదన్ నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు.  స్వామి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

 ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడారు. గోమాత కామధేనువన్నారు. గోవు మానవుల వ్యవసాయ అవసరాలకు, ఆరోగ్య రక్షణకు కూడా ఉపయోగపడుతోందని అన్నారు. గో పూజా ఫలితం గురించి అనేక పురాణాల్లో వివరించారన్నారు. దక్షిణ భారతదేశంలో గోశాలలు, ఉత్తర భారత దేశంలో వేద పాఠశాలలు  ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్వామి చెప్పారు. గో సంరక్షణకు టీటీడీ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.  తిరుమల ఆలయ వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచాలని ధర్మకర్తల  మండలి తీసుకున్న నిర్ణయంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్వామి స్పందించారు. శాస్త్రానికి, సంప్రదాయానికి ఇబ్బంది కలగని మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించడం తప్పుకాదన్నారు. దేశంలోని అనేక ప్రముఖ విష్ణు క్షేత్రాల్లో ఉత్తర ద్వారం పది రోజులు తీసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారని స్వామి చెప్పారు. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని, ఎక్కువ మందికి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించడాన్ని తప్పు పట్టాల్సిన పని లేదని ఆయన చెప్పారు.  

టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ శేఖర్ రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్వీ గో సంరక్షణ శాల సంచాలకులు శ్రీ హరనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.