GRAND ARRANGEMENTS FOR SKVST BRAHMOTSAVAMS_ వైభవంగా శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి – తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 14 February 2019: There should not be any compromise on the arrangements to be made for annual brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram during the ensuing brahmotsavams, said Tirupati JEO Sri.B Lakshmi kantham.

The JEO inspected the arrangements in
The temple on Thursday evening, the JEO said wide publicity need to be given in surrounding villages on nine day event.

During the review meeting he directed the officials to create a whatsapp group to update the pilgrim information during brahmotsavams. He also negotiated with concerned HoDs on the ensuing arrangements for the big event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి – తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 14: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో గురువారం సాయంత్రం అధికారులతో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఫిబ్రవరి 24వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై మార్చి 4వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల కటౌంట్లు, దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రగిరి, తిరుపతిలలో బ్రహ్మోత్సవాల కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనసేవల వివరాలతో పుస్తకాలు ముద్రించి, భక్తులకు అందిచాలని, పుస్తక విక్రయశాల తొమ్మిది రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రోజువారి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం శోభాయాత్ర, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్‌.వి. సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి ప్రసాదం కౌంటర్లను పెంచాలన్నారు. మొబైల్‌ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ద్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్‌ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టిటిడి విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

సమావేశం అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల గోడసత్రికలు ఆవిష్కరణ

అంతకుముందు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం గురువారం సాయంత్రం ఆలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని తెలిపారు. భక్తులకు వేగంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి జరుగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీహారాన్ని శోభాయాత్రగా తీసుకురానున్నట్లు తెలిపారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పేరిట టిటిడి అధికారులతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, ఇందులో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ఇతర ఇబ్బందులు అధికారులందరికి తెలుస్తుందని, తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాహనసేవలు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు జరుగనున్నాయని, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని జెఈవో కోరారు.

ఈ సమావేశంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీ ధనంజయులు, శ్రీమతి ఝూన్సీరాణి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, విజివో శ్రీఅశోక్‌కుమార్‌ గౌడ్‌, ఏఈవో శ్రీ లక్ష్మయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.