GRAND KUMARADHARA MUKKOTI HELD _ ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి
Tirumala, 24 February 2024: A large number of devotees participated in the Kumaradhara Theertha Mukkoti observed by TTD with religious fervour in Tirumala on Saturday.
The fete is usually observed on the Pornami day of Magha Masam every year.
Amidst natural greenery and canyon environment, devotees cherished the spiritual vibes.
TTD engineering, vigilance, Anna Prasadam, health departments made elaborate arrangements for the safety and comfortable journey of devotees amidst the lengthy terrain
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి
తిరుమల, 24 ఫిబ్రవరి 2024: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శనివారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మాఘ మాసంలో పూర్ణిమనాడు కుమారధారతీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థాన్ని దర్శించి, స్నానమాచరిండాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ సందర్భంగా భక్తులు కొండమార్గాల్లో సౌకర్యవంతంగా నడిచేందుకు వీలుగా ఇంజినీరింగ్, అటవీ విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు, తాగునీరు అందించారు. శ్రీవారి సేవకుల సాయంతో భక్తులకు వీటిని అందజేశారు. మార్గమధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని టీటీడీ భద్రతా విభాగం అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. తీర్థం వద్ద ప్రథమచికిత్స కేంద్రాన్ని ఏర్పాటుచేసి అవసరమైనవారికి మందులు అందించారు.
ప్రాశస్త్యం :
వరాహ, మార్కండేయ పురాణాల ప్రాకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏం చేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమర ధార’ అనే పేరు వచ్చింది.
పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందారు. సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.