Guest Lecture by Sri Dileep Reddy, Commissioner RTI _ ప్రజలకు సమాచారం ఇవ్వడం బాధ్యత : సమాచార హక్కు చట్టం కమీషనర్ శ్రీ దిలీఫ్‌రెడ్డి
ప్రజలకు సమాచారం ఇవ్వడం బాధ్యత : సమాచార హక్కు చట్టం కమీషనర్ శ్రీ దిలీఫ్‌రెడ్డి
తిరుపతి, ఆగష్టు -13, 2009: ప్రజలకు సమాచారం ఇవ్వడమనేది ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా గుర్తించుకోవాలని సమాచార హక్కు చట్టం కమీషనర్ శ్రీ దిలీఫ్‌రెడ్డి చెప్పారు. గురువారం ఉదయం స్థానిక శ్వేతనందు ఆయన తితిదే ఉద్యోగులకు సమాచారహక్కు చట్టంపై అవగాహన అను అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ దిలీఫ్‌రెడ్డి మాట్లాడుతూ తితిదే పెద్ద ధార్మిక సంస్థలో ప్రతి ఉద్యోగి సమాచార హక్కుచట్టం గురించి పూర్తి అవగాహన కల్గివుండాలని తెలిపారు. ఎవ్వరైనా కూడా ఇలా ఫలానా సమాచారం ఇవ్వడం తమకు, తమ సంస్థకు నష్టం అని భావించరాదని ఆయన అన్నారు. అంతే కాకుండా ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే అది పెనాల్టీ క్రిందికి వస్తుందని తద్వారా అతనికి, అతని సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం వుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2007 సం.లో 32,000 అప్పీల్స్ రాగా, 27,000 అప్పీల్స్‌ను పరిష్కరించామని, గత సంవత్సరం 65,000 అప్పీల్స్ రాగా 54,500 లు పరిష్కరించామని ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఉద్యోగినీ ఉద్యోగులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు.
అంతకు మునుపు తితిదే జెఇఓ డా.యువరాజ్ మాట్లాడుతూ సమాచార హక్కుచట్టంపై గతంలో కంటే ఇప్పుడు ప్రజలలో అవగాహన పెరిగిందని అన్నారు. ఈచట్టం ద్వారా ఎవ్వరైనా ప్రశ్నలు అడిగినపుడు సందేహం వస్తే వెంటనే ఈచట్టం పరిధిలో ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఏమేరకు ఇవ్వవచ్చునో తదితర సందేహాలను సైతం అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని ఆయన ఉద్యోగులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తితిదే శ్వేత డైరెక్టర్ శ్రీ భూమన్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 15వ తేదిన స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా తితిదే పరిపాలన భవనం వెనుక గల మైదానం నందు ఉదయం 8.30 గంటలకు తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం తితిదే ఉద్యోగినీ, ఉద్యోగుల వార్షిక క్రీడలను ప్రారంభిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.